
రైల్వే స్టేషన్ లో గుండెపోటుకు గురైన 40 ఏళ్ల వ్యక్తి గురించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. చైనాలోని హునాన్ ప్రావీన్స్ లో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి హడావిడిగా రైలు ఎక్కడానికి వచ్చి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికుల సాయంతో 20 నిమిషాల తర్వాత అతడిని బతికించారు. కానీ కళ్లు తెరిచిన వెంటనే అతడి ముఖంలో ఆందోళన.. ‘నాకు ఆఫీసుకు లేటవుతోంది. నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లకండి.. నన్నెలాగైనా హై స్పీడ్ ట్రైన్ ఎక్కించండి’ అంటూ అక్కడున్న వారిని దీనంగా అడగడం ప్రతిఒక్కరినీ కదిలించింది. ఈ ఘటన చైనాలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోంది. చైనాలో ఉద్యోగాలు లేక యువత బెంబేలెత్తిపోతున్నారు. చిన్నా చితకా ఉద్యోగాలు సంపాదించిన వారంతా దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మరికొందరు పని భారం మోయలేక ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజా ఘటన ఈ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలుపుతోంది. ప్రాణాలు పోతున్నా ఉద్యోగాలు నిలుపుకునేందుకు ఓ మధ్యతరగతి వ్యక్తి పోరాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంటి కోసం చేసిన రుణాలు, పిల్లల చదువులు, నెలవారీ ఖర్చులు.. ఇలా చైనా పౌరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇతనొక్కడే కాదు ఇలాంటి వారు ఆ దేశంలో లెక్కలేనంత మంది ఉన్నారు. అందరిదీ ఒకే సమస్య. పొద్దున్న లేస్తే ఉపాధి కోసం పరుగులు పెట్టడం.
చైనాలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండటం, ఉద్యోగులపై అధిక పనిభారం వంటి వాటిపై తరచూ నివేదికలు వస్తున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన గణాంకాల్లో 16 నుంచి 24 సంవత్సరాల వయసు గలవారిలో నిరుద్యోగిత రేటు గతేడాది నవంబర్ లో 16. 1 శాతంగా ఉందని సూచిస్తోంది. ఈ ఏడాది ఇది 17.1 శాతంగా ఉంది. అదనపు పని గంటల కారణంగా అక్కడి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగుచూస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఓ డిజటల్ కంెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల ఇంజినీర్ అకస్మాత్తుగా మరణించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.