కొండలు, గుట్టలు దాటుతూ, అడవుల గుండా అలలారుతున్న సుందర జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, గుట్టలపై నుండి కిందికి జాలువారుతూ సందడి చేస్తున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేందుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. తాజాగా భారీ వర్షాలతో జలపాతాలు మరింత కనువిందు చేస్తున్నాయి. మూడు రోజుల భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జలపాతాల దగ్గరకు పర్యాటకులు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు జలపాతాలు వరదలతో కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జలపాతాల వద్ద ఆంక్షల అమలు చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర, నేరడిగొండ మండలం కుంటాల జలపాతాలకు పర్యాటకుల సందర్శనను నిలిపివేస్తూ అటవీ శాఖ ప్రకటన విడుదల చేసింది. అటవీశాఖ అధికారుల ఆదేశాలతో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. పర్యాటకులను అనుమతించడం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు జలపాతాల దగ్గరకు పర్యాటకులను అనుమతించబోమని, పర్యాటకులు జలపాతం సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. వీకెండ్ కావడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అటు ములుగు జిల్లా బొగత జలపాతాలకు వరద పోటెత్తింది. అత్యంత ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరిగడంతో అప్రమత్తమైన అధికారులు.. జలపాతాల దగ్గర నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాల కారణంగా బొగత జలపాతానికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. పర్యాటకులు రావద్దని సూచిస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా ఎత్తిపోతలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో అక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నారు. దీంతో పర్యాటకులు భారీగా చేరుకుంటున్నారు. పర్యాటకులతో కళకళలాడుతోంది. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున్న వస్తున్నారు పర్యాటకులు. వరద ఉధృతి పెరిగితే పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోనున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..