రెక్కల కష్టానికి దక్కిన గౌరవం.. ఆ నలుగురు అక్కాచెల్లెళ్ల వెనుక 25 ఏళ్ల రైతు కూలీ పోరాటం!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు గొప్ప మైలురాయిని అందుకున్నారు. తమ కఠోర శ్రమ, అంకితభావంతో ఒక గొప్ప ప్రతిభతో ఉన్నత ఉద్యోగాలు సాధించి యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. జీవాచివాడి గ్రామానికి చెందిన హనుమంత్ చౌరే, దైవశాల చౌరే దంపతులు గత 25 ఏళ్లుగా చెరకు కోత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

రెక్కల కష్టానికి దక్కిన గౌరవం.. ఆ నలుగురు అక్కాచెల్లెళ్ల వెనుక 25 ఏళ్ల రైతు కూలీ పోరాటం!
Mumbai Police Sisters

Updated on: Jun 06, 2026 | 2:57 PM

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు గొప్ప మైలురాయిని అందుకున్నారు. తమ కఠోర శ్రమ, అంకితభావంతో ఒక గొప్ప ప్రతిభతో ఉన్నత ఉద్యోగాలు సాధించి యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. జీవాచివాడి గ్రామానికి చెందిన హనుమంత్ చౌరే, దైవశాల చౌరే దంపతులు గత 25 ఏళ్లుగా చెరకు కోత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వారు తమ కుమార్తెల చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు.

వారి నలుగురు కుమార్తెలు ఉష, అర్చన, గీతాంజలి, శీతల్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూనే పోలీసు నియామక పరీక్షలకు సిద్ధమయ్యారు. మొదటగా ఉష, అర్చన 2019లో ముంబై పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో విజయం సాధించి విధుల్లో చేరారు. అక్కల స్ఫూర్తితో మిగిలిన ఇద్దరు సోదరీమణులు గీతాంజలి, శీతల్ కూడా కష్టపడి చదివి, ఇటీవలి నియామక ప్రక్రియలో ముంబై పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆడపిల్లలు ముంబై పోలీసు శాఖకు ఎంపిక కావడంతో జీవాచివాడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చెరకు రైతుకూలీలుగా ఏళ్ల తరబడి పొలాల్లో కష్టపడిన తల్లిదండ్రుల చేతులే, ఈరోజు తమ నలుగురు కూతుళ్లను ఖాకీ యూనిఫాంలో నిలబెట్టాయని గ్రామస్తులు కొనియాడుతున్నారు. “మేము మా కుమార్తెలను ఎల్లప్పుడూ చదువులో ముందుకు సాగమని, వారి కలలను సాకారం చేసుకోమని ప్రోత్సహించాము. ఈరోజు వారి విజయాన్ని చూస్తుంటే మా 25 ఏళ్ల కఠోర శ్రమ ఫలించినట్లు అనిపిస్తోంది,” అని చౌరే దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ నలుగురు సోదరీమణుల కథ కేవలం ఒక కుటుంబ విజయమే కాదు, పేదరికం, కష్టాలు ఎదురైనా తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనే వేలాది మంది తల్లిదండ్రులకు ఒక గొప్ప స్ఫూర్తి. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సవాలనైనా అధిగమించవచ్చని ఈ ‘ఖాకీ సిస్టర్స్’ నిరూపించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us