DWCRA Women Marts: తక్కువ ధరలు – ఎక్కువ నాణ్యత.. ఇదే ఆ మహిళల సక్సెస్ ఫార్ములా.. ఎక్కడో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Jan 26, 2024 | 11:12 PM

అంతా ఒకటయ్యారు. చేయి చేయి కలిపారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన చైన్ సిస్టం కార్పొరేట్ మాల్స్‌కు ఏ మాత్రం తీసిపోమని రుజువు చేస్తూ వడివడిగా ముందుకు సాగుతున్నారు విజయనగరం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు. ప్రతి మహిళా స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఫార్ములాను తూ.చా. తప్పకుండా పాటిస్తూ అభివృద్ధి పధం వైపు దూసుకుపోతున్నారు.

DWCRA Women Marts: తక్కువ ధరలు - ఎక్కువ నాణ్యత.. ఇదే ఆ మహిళల సక్సెస్ ఫార్ములా.. ఎక్కడో తెలుసా..?
Dwcra Group Women Marts
Follow us on

అంతా ఒకటయ్యారు. చేయి చేయి కలిపారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన చైన్ సిస్టం కార్పొరేట్ మాల్స్‌కు ఏ మాత్రం తీసిపోమని రుజువు చేస్తూ వడివడిగా ముందుకు సాగుతున్నారు విజయనగరం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు. ప్రతి మహిళా స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఫార్ములాను తూ.చా. తప్పకుండా పాటిస్తూ అభివృద్ధి పధం వైపు దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఒకరు లేదా ఒక గ్రూప్ గా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న డ్వాక్రా మహిళలు ఇప్పుడు వేలాది మంది కలిసి ఒకే ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చి భారీ ప్రాజెక్ట్స్‌కు శ్రీకారం చుట్టారు.

ఒక మహిళ మార్ట్ ఏర్పాటు చేసుకోవాలని రెండు మండల సమాఖ్య సభ్యులంతా కలిసి నిర్ణయించుకున్నారు. సుమారు ముప్పై వేల మంది మహిళలు సభ్యులుగా ఒక్కొక్కరు కేవలం రూ. 310 మాత్రమే వాటా ధనం క్రింద పెట్టుబడి పెట్టారు. అలా దాదాపు తొంభై లక్షలకు పైగా నిధులు సమకూరాయి. అలా వచ్చిన డబ్బుతో వెంటనే గరివిడి, ఎస్. కోటలో రెండు పెద్ద బిల్డింగ్స్ అద్దెకు తీసుకుని కార్పోరేట్ మాల్‌ను తలపించేలా సుందరంగా తీర్చిదిద్దారు. పూర్తిగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసుకుంటున్న బిజినెస్ కాబట్టి దానికి చేయూత మహిళ మార్ట్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత ఆ మహిళ మార్ట్స్ లోకి అన్నిరకాల కిరాణా, ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

అంతేకాదు మార్ట్‌లో డ్వాక్రా మహిళలు తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులు పెట్టగా, మిగతా ఫ్యాన్సీ, కాస్మటిక్ ప్రొడక్ట్స్ కోసం ఐటీసీ, హెచ్‌యూఎల్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో అనుసంధానం అయ్యారు. మహిళలే నేరుగా నడుపుతున్న సంస్థ కావడంతో ఆయా సంస్థలు సైతం బయట మాల్స్ కన్నా ఈ మార్ట్స్ కి తక్కువ ధరకే అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. తరువాత మార్ట్ నిర్వహణ కోసం కావాల్సిన అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకుని మార్ట్స్ ప్రారంభించారు. అలా ప్రారంభించిన మార్ట్ తక్కువ సమయంలోనే మంచి ఆదరణ పొందాయి.

ఓ వైపు తాము తయారు చేసిన ఉత్పత్తులే నేరుగా మార్ట్ కి అందించడంతో పాటు తక్కువ ధరకే కార్పోరేట్ సంస్థలు తమ ప్రొడక్ట్స్ అందించడంతో వీరు కూడా తక్కువ ధరకే కస్టమర్స్‌కు ఇవ్వగలుగుతున్నారు. దీంతో ఈ మహిళ మార్ట్‌లో నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ధరకు లభిస్తున్నాయన్న టాక్ విస్తృతంగా సాగింది. అలా తక్కువ సమయంలోనే ఈ మహిళ మార్ట్ విశేష ఆదరణ పొందడంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఒక్కో మార్ట్‌లో రోజుకు తొంబై నుండి లక్ష రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి.

ఇక, బయట మాల్స్ కన్నా ఈ మార్ట్ లో తక్కువ ధరకే ఉత్పత్తులు దొరకడంతో కస్టమర్స్ కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్ట్స్ కారణంగా సుమారు పదహారు మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా వచ్చాయి. ఈ మార్ట్ నిర్వహణ కొరకు సభ్యులంతా కలిసి పన్నెండు మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమించుకున్నారు. మార్ట్‌కు సంబంధించిన ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే సమావేశమై వ్యాపార అభివృద్ధి కోసం కావాల్సిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేలాది మంది డ్వాక్రా మహిళలు సభ్యులుగా ఉండి నడుస్తున్న మార్ట్స్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు కానీ, అవకతవకలు కానీ జరగకుండా డిఆర్‌డిఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు డిపిఎంలు రవికుమార్, జయశ్రీ నిరంతరం పర్యవేక్షిస్తూ మహిళలకు సూచనలు, సలహాలు ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇలా మహిళా మార్ట్స్‌లో వచ్చిన లాభాన్ని ప్రతి మహిళ సభ్యురాలు అందుకునేలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..