
International Dance Day 2021: డ్యాన్స్ కేవలం చిందులు మాత్రమే కాదు. అలసిన శరీరంతోపాటు మనసును కూడా ఉత్సాహపరుస్తుంది. అంతేకాకుండా.. డ్యాన్స్ చేస్తే శరీరం ఫిట్ గా ఉండేందుకు సహయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడో వేడుకలకు మాత్రమే కాకుండా… చిన్న చిన్న ఆనందాలు కలిగినప్పుడు డ్యాన్స్ చేస్తే మీరు మరింత ఉల్లాసంగా ఉంటారు. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి అవయవం, కండరం కదులుతాయి.. వ్యాయామానికి బద్దకించే బాడీ కాస్తా.. కొత్త ఉత్సాహంతో గంతులేస్తుంది.. ఈ కారణంగా శరీరంలోని ఎన్నో కేలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా బరువు తగ్గడం.. బిగుసుకున్న కండరాలు రిలాక్స్ అవ్వడం.. మనసు ప్రశాంతంగా మారుతుంటుంది.. అంతేకాదు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలను అదుపు చేయడంలో డ్యాన్స్ ముందుంటుంది. ఈరోజు ఏప్రిల్ 29 ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. మరీ ఈ రోజును ఎవరు ప్రారంభించారు, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామా.
నృత్య చరిత్ర అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం 1982లో వెలువడింది. ఆ ఏడాది నుంచే అంతర్జాతీయ నృత్య దినోత్సవం (ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే)ను జరుపుకుంటారు. ఈ ప్రకటనను ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ ఇచ్చింది. 1760లో ప్రచురించబడిన ప్రముఖ రచన letters sula dance అనే రచన దాని రచయిత, ఆధునిక నృత్యనాటికల సృష్టికర్త అయిన జీన్ – నోవెర్రీ (1727-1810) జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ డ్యాన్స్ డే ను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవానికి సందేశం రాయడానికి అత్యుత్తమ నృత్య వ్యక్తిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన హోస్ట్ సిటీలో ఐటిఐ ఒక ప్రధాన కార్యక్రమాన్ని కూడా జరుపుతారు. అందులో డ్యాన్స్ షోస్, స్టడీ వర్క్ షాప్స్, మానవతా ప్రాజెక్టులు, ప్రముఖ నృత్య ప్రముఖుల స్పీచ్, అలాగే పలు దేశాల రాయబారులు ఉంటారు.
ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ డ్యాన్స్ డే జరుపుకుంటారు. అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను దాటి అన్ని రూపాలను ప్రోత్సహించడం ఈరోజు ప్రధాన లక్ష్యం. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ నృత్య కళకారుడిని ఎంపిక చేస్తుంది. ఇక మన భారతదేశంలో ఎన్నో సంప్రదాయ నృత్యాలు ఉన్నాయి. వాటి వెనుక దాగి ఉన్న చరిత్రలు కూడా అనేకం. భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, కూచిపూడి నృత్యము, మోహినియాట్టం, కథక్, ఒడిస్సీ ఇలా సంప్రదాయ నృత్యాలు అనేకం ఉన్నాయి.
సాధారణంగా ఈరోజున చాలా దేశాలలో గాలా ఈవెంట్స్, ప్రొఫెషనల్ డ్యాన్స్ షోస్, స్టేజ్ ఫెర్ఫామెన్స్ జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా అలాంటి బహిరంగ వేడుకలకు అనుమతి లేదు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో మీలోని టాలెంట్ వెలికి తీయడానికి ఎన్నో సౌకర్యాలు మీ ముందు ఉన్నాయి. ఈసారి ఈ ఇంటర్నేషనల్ డ్యాన్స్ షోను ఆన్ లైన్ వేదికగా జరుపుకొండి. విభిన్న పాటకు సరికొత్తగా స్టెప్పులెసి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి మీ స్నేహితులకు పంచుకోండి.