
ఇల్లు కట్టడం.. పెళ్లి చేయడం.. మన సమాజంలో ఈ రెండు విషయాలు చాలా ప్రాధాన్యం ఉన్నవి. ఎందుకంటే ఒకవైపు ఖర్చు ఎంత పెట్టినా ఇంకా పెట్టాలేమో అన్నట్లుగా ఉంటుంది. ఎక్కడ పెంచాలో.. ఎక్కడ తగ్గించుకోవాలో అర్థం కాదు.. సరైన ప్లానింగ్ లేకపోలే అంతా గందరగోళమే. మొత్తం తడిసిమోపడమవడం ఖాయం. తీరా అంత ఖర్చు పెట్టాక మనసుకు సంతృప్తి లేకపోతే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్రీ ప్లాన్ చాలా అవసరం. మరి మనకున్న బడ్జెట్లో హుందాగా.. గ్రాండ్.. పెళ్లి వేడుక చేసుకోవడం ఎలా? మీరు దీని గురించే ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ మీ కోసమే చదివేయండి..
పెళ్లికి అధిక ప్రాధాన్యం..
మన సంప్రదాయంలో పెళ్లికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. హంగు, ఆర్భాటాలు చేస్తారు. జీవితంలో ఒక్కసారే జరిగే సంబరం కావడంతో ఖర్చుకు కూడా ఎక్కడా వెనుకాడరు. పెళ్లి కార్డు దగ్గర నుంచి.. మండపం డెకరేషన్, భోజనం, పెళ్లి వస్త్రాలు, నగలు ఒకటా రెండా అన్ని చేతి చమురు వదిలించేవే. సగటున పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నరూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఉంటుందన్నది అంచనా.
పక్కా ప్లాన్ ముఖ్యం..
పెళ్లి ఎంతో గ్రాండ్ చేశాం అనే దానికన్నా ఎంత ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేశామన్నది ముఖ్యం. అనుకున్న బడ్జెట్ లోపు చేయాలంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి.. ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలని అనేది బేరీజు వేసుకోవాలి. ముందుగా పెళ్లిలో చేయాలనుకునే వివిధ రకాల ఈవెంట్స్ కు కావాల్సిన వస్తువులు, అవసరమైన సామగ్రి లిస్ట్ చేసుకోవాలి. అవసరమైతే మండపం, కేటరింగ్ వంటి వాటిని కలిపి ఒకరికే కంట్రాక్ట్ ఇస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పర్యవేక్షణ కూడా బావుంటుంది. వస్త్రాలు, నగలు కూడా అవసరం మేరకే కొనుగోలు చేయాలి.
అతిథుల జాబితా అవసరమే..
పెళ్లి అంటేనే సకుటుంబ సపరివారంతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందు కోసం బంధువులకు ఒకటని, మిత్రులకు మరొకటని కార్డులు ప్రింట్ చేయిస్తుంటారు. ఇక్కడ కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ కామన్ గా ఆహ్వాన పత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. అలాగే ఒక పెళ్లిలో ప్రస్తుతం రకరకాల ఈవెంట్స్ చేస్తున్నారు. సంగీత్ అని , రిసెప్షన్ అని చాలా రకాలుగా చేస్తున్నారు. పెళ్లి కూతురు దగ్గర కొన్ని, పెళ్లి కొడుకు వద్ద మరికొన్ని.. ఇద్దరిని కలపి ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటిని ఎవరెవరిని పిలవాలనే దానిపై కూడా కసరత్తు చేయాలి.అప్పుడు ఏ ఈవెంట్ కు ఎంతమంది వస్తారు అనేది అవగాహన ఉంటుంది కాబట్టి.. అందుకనుగుణంగా అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి.
హనీమూన్ ట్రిప్..
పెళ్లి తంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల హనీమూన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హనీమూన్ డెస్టినేషన్లుగా పేరుగాంచిన దేశాలకు ఎగిరిపోతున్నారు. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణం అవుతుంది. మన అకౌంట్లో ఉన్న నగదును బట్టి మన దేశంలోనే అనువైన ప్రాంతాలను ఎంచుకుంటే చాలా సమయంతో పాటు ధనమూ ఆదా అవుతుంది. ఒకవేళ విదేశాలకే వెళ్లాలనుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్లిరాగలికే థాయ్ ల్యాండ్ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది.