Parenting Tips: పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగాలంటే.. ప్రేమతో, ఓపికతో ఇలా చేయండి..!

పిల్లలు చదవడం లేదని కొందరు తల్లిదండ్రులు కంగారు పడతారు. కోప్పడటం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారు. కానీ వీటి వల్ల లాభం ఉండదు. ఇంకా చదువు అంటే విరక్తి పెరుగుతుంది. పిల్లలకు చదవాలని ఆసక్తి పెంచాలంటే కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Parenting Tips: పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగాలంటే.. ప్రేమతో, ఓపికతో ఇలా చేయండి..!
Kids Education

Updated on: Jun 22, 2025 | 10:32 PM

పిల్లలు బడి నుంచి రాగానే బలవంతంగా చదివించొద్దు. బడిలో గంటల తరబడి క్లాసులు, హోంవర్క్, ఆటలు అన్నీ అయ్యాక అలసిపోతారు. కాస్త విశ్రాంతి, సరదాగా ఆడుకునే సమయం తర్వాతే చదవడం మొదలుపెడితే మెదడు కూడా సాయపడుతుంది. టీవీ చూస్తుంటే లేదా ఆట ఆడుతుంటే వారిని పూర్తిగా ఆపొద్దు. కాస్త సమయం ఇవ్వండి.

ఒత్తిడితో చదివించడం కన్నా సరదాగా నేర్పితే పిల్లలకు చదవాలని ఆసక్తి పెరుగుతుంది. పాఠాలను కథల్లా చెప్పండి. పుస్తకాల్లోనే కాదు.. వీడియోలు, యాక్టివిటీల ద్వారా సబ్జెక్టును అర్థం చేయించండి. పాఠాల్లోని విషయాలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో చూపిస్తే మరింత ఆసక్తి వస్తుంది.

పిల్లలు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు చిన్న బహుమతి ఇవ్వడం.. స్టార్ స్టిక్కర్ వేయడం లాంటివి వారిలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఒక్కో విజయం తర్వాత ఒక చిన్న గుర్తింపు లభిస్తే తర్వాత పనిలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వారానికి ఒకసారి మంచి ప్రవర్తనకు చిన్న బహుమతి ఇవ్వవచ్చు.

పిల్లలు తప్పుగా సమాధానం చెప్పినా వారిని తక్కువ చేయొద్దు. కోప్పడొద్దు. నెమ్మదిగా సరిదిద్దండి. ఒత్తిడి లేకుండా నేర్పితే వారు మరింత నమ్మకంగా తమ అభిప్రాయాలు చెబుతారు. సరైన సమాధానాలు చెప్పినప్పుడు మెచ్చుకోవడం ఇంకా ప్రోత్సాహం ఇస్తుంది.

పిల్లలు చదువుతారు అని ఆశతో ఎప్పుడూ పుస్తకాల ముందు కూర్చోబెట్టడం నష్టం చేస్తుంది. చదువు తప్ప ఇంకేమీ చేయొద్దని చెబితే వారు విసుగు చెంది చదువును కూడా మానేస్తారు. రోజులో కొంత సమయం ఆట, టీవీ చూడటం, రంగులు వేయడం లాంటి వారి ఇష్టమైన పనులకూ ఇవ్వాలి. చదువుతో పాటు సరదా కూడా అవసరమే.

చిన్న పిల్లలు ప్రశ్నలు అడిగితే వాటిని పట్టించుకోకుండా వదిలేయొద్దు. సరైన సమాధానాలు ఇవ్వండి. మీరు వారితో ప్రశాంతంగా మాట్లాడినప్పుడు వారు ఇంకొన్ని విషయాలు అడుగుతారు. తెలుసుకోవాలని ఆతృత పెరుగుతుంది. ఇది చదువులో ఆసక్తికి బలం ఇస్తుంది.

మీరు పిల్లలకు ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా నిలబెట్టుకోవాలి. లేకపోతే వారు నమ్మకాన్ని కోల్పోతారు. ఎంత చిన్న విషయమైనా నిలబెట్టుకున్నప్పుడే వారు మిమ్మల్ని నమ్మి ప్రవర్తిస్తారు.

ఈ విధంగా చిన్న మార్పులు, ప్రేమతో కూడిన పద్ధతులు పాటిస్తే పిల్లలు చదవడానికి ఆసక్తితో ముందుకు వస్తారు. చదువు ఒక భారం కాదని వారిలో నమ్మకం కలుగుతుంది. తప్పకుండా మీరు వారిలో ఒక మార్పు చూడగలుగుతారు.