Jan Dhan Bank Account: ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సేవింగ్స్, ఇతర లావాదేవీల కోసం ప్రజలు బ్యాంక్ అకౌంట్‌ను తీసుకుంటారు. అయితే, బ్యాంక్ ఖాతా ఉన్న వారు పలు రకాలుగా ప్రయోజనాలు కూడా పొందుతారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. జన్‌ధన్ పేరిట దేశ ప్రజలందరి చేత బ్యాంకు ఖాతాలను తెరిపించిన విషయం తెలిసిందే. జన్‌ధన్ బ్యాంకు ఖాతా కలిగిన వారికి ఇన్స్యూరెన్స్ కల్పించడంతో పాటు.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను కూడా ఆ ఖాతాల్లోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. ఈ ఖాతాను ఉచితంగానే తెరవడం జరుగుతుందని స్పష్టం చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు జన్‌ధన్ ఖాతాలను తెరిచారు. అయితే, ఇప్పటికీ కొంతమంది ప్రజలకు జన్‌ధన్ ఖాతా లేదు. దాంతో వారు ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారికోసమే.. సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఇతర బ్యాంకు ఖాతా కలిగి ఉన్నా.. దానిని జన్‌ధన్ అకౌంట్ కిందకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఈ అవకాశంతో ప్రజలు తమ సాధారణ బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ అకౌంట్లుగా మార్చుకునేందుకు వీలు ఉంటుంది. మరి సాధారణ బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ అకౌంట్లుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ బ్యాంక్ అకౌంట్‌ను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలంటే సదరు వ్యక్తులు బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికారులు తమ ప్రతిపాదనను చెబితే.. వారు ఒక రిక్వెస్ట్ ఫారం ఇస్తారు. ఆ ఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తమ అకౌంట్‌ను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నట్లు అందులో పేర్కొనాలి. అలా చేసిన తరువాత ఆ ఫారానికి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్(ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వంటివి జత చేయాలి. వాటిని బ్యాంకులో సబ్మిట్ చేసిన తరువాత.. అధికారులు పరిశీలిస్తారు. ఆ తరువాత మీ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చేస్తారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. ఇతర బ్యాంకుల్లో మీకు జన్‌ధన్ అకౌంట్ ఉన్నట్లయితే మీ అభ్యర్థన తిరస్కరించబడుతుంది.
జన్‌ధన్ అకౌంట్‌తో ఉపయోగాలు..
జన్ ధన్ అకౌంట్ వల్ల ఖాతాదారులు అనేక ప్రయోజాలు పొందే అవకాశం ఉంది. ఈ జన్‌ధన్ ఖాతాలకు మినిమన్ బ్యాలెన్స్ వంటి నిబంధనలు లేవు. ఈ అకౌంట్ కలిగిన వారికి రూ. 2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది. ఇంకా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఫలితంగా రూ. 10,000 వరకు నగదు పొందవచ్చు.
Also read:
Minister Nani vs Nagababu: ట్విట్టర్ వేదికగా మంత్రి నాని, నాగబాబు మధ్య మాటల యుద్ధం.. కారణమదేనా..?