
రాగి పాత్రలు శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో భాగంగా ఉన్నాయి. రాగి గ్లాసుల్లో నీరు తాగడం, రాగి పాత్రలలో వంట చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ, ఈ రాగి పాత్రలు త్వరగా మురికిగా మారతాయి. శుభ్రం చేయడం కష్టం అవుతుంది. ప్రతిసారీ గంటల తరబడి రుద్ది రుద్ది తోమాల్సి వస్తుంది. దీంతో ఆ పాత్రలు పాతవాటిలా, నిస్తేజంగా కనిపిస్తాయి. అందుకే, మీ రాగి పాత్రలను కొత్తగా మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వాటితో మీ రాగిపాత్రలు నిమిషాల్లో మెరుస్తూ కనిపిస్తాయి. ఇందుకోసం మీ ఇంట్లో ఉన్న కేవలం నాలుగు పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా కేవలం 5 నిమిషాల్లో రాగి పాత్రలను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పాత్రలను శుభ్రం చేయడానికి, గోధుమ పిండి, పసుపు, నిమ్మకాయ, ఉప్పు అవసరం. ఒక చిన్న గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకుని, దానికి అర టీస్పూన్ పసుపు పొడి వేసి, కొద్దిగా నిమ్మరసం వేసి, చిక్కటి పేస్ట్ లా కలపండి. ఈ పేస్ట్‌ను కంటైనర్ లోపల, వెలుపల మందంగా పూయండి. మురికి పూర్తిగా వదిలిపోవాలంటే..5-10 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ పాత్రను సున్నితంగా రుద్దండి. ఎక్కువ మరకలు, నల్లగా ఉంటే కొంచెం ఉప్పు చల్లి మళ్ళీ రుద్దండి. పాత్రపై గీతలు పడకుండా ఉండటానికి వృత్తాకారంలో కాస్త బలంగా రుద్దండి.
ఇప్పుడు గోరువెచ్చని నీటితో పాత్రను శుభ్రం చేసుకోండి. సబ్బు అవసరం లేదు. ఎందుకంటే, ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ మురికి, ఆక్సైడ్లను తొలగిస్తుంది. మంచినీటితో శుభ్రంగా కడిగిన తరువాత ..మరో శుభ్రమైన గుడ్డ లేదా కిచెన్ టవల్ తో పాత్రను క్లీన్‌గా తుడవండి. కావాలనుకుంటే, చివరిగా కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తుడవండి, తద్వారా అది మరింత మెరుస్తూ కనిపిస్తుంది. రాగి పాత్రలను ఉపయోగించిన వెంటనే కడిగి ఆరబెట్టండి. నెలకోసారి నిమ్మకాయ, ఉప్పుతో తేలికగా పాలిష్ చేయండి. తద్వారా అవి కొత్తవిలా మెరుస్తాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..