
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మిస్టరీ.. చరిత్రను రక్తసిక్తం చేసిన రోజు.. విజ్ఞాన శాస్త్రం ఎంత ఎదిగినా నేటికీ మనుషులను వెంటాడుతున్న భయం ఫ్రైడే 13. ఈరోజు ఫిబ్రవరి 13 శుక్రవారం కావడంతో మరోసారి ఈ చర్చ మొదలైంది. చాలా దేశాల్లో ఈ రోజున వ్యాపారాలు ఆగిపోతాయి, జనం ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. అసలు 13వ సంఖ్యకు, శుక్రవారానికి ఉన్న లింకేంటి? యేసుక్రీస్తు సిలువ వేయడం నుండి నైట్స్ టెంప్లర్ల ఊచకోత వరకు.. ఈ రోజు చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన, భయంకరమైన కథనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
క్రైస్తవ సంప్రదాయం ప్రకారం.. ఈ భయానికి ప్రధాన మూలాలు యేసుక్రీస్తు జీవితంలో ఉన్నాయి. బైబిల్ కథల ప్రకారం.. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజు శుక్రవారం. ఇక ఆయన తన శిష్యులతో కలిసి చేసిన చివరి భోజనంలో మొత్తం 13 మంది ఉన్నారు. ఆ 13వ వ్యక్తి చేసిన ద్రోహం వల్లే యేసుక్రీస్తుకు మరణశిక్ష పడిందని నమ్ముతారు. అప్పటి నుండి 13వ సంఖ్య, శుక్రవారం కలిసి వస్తే దానిని ఒక చెడు సంకేతంగా చూడటం మొదలైంది.
ఈ భయాన్ని మరింత బలపరిచిన సంఘటన అక్టోబర్ 13, 1307న జరిగింది. ఆ రోజు శుక్రవారం. ఫ్రాన్స్ రాజు ఫిలిప్ IV ఆదేశం మేరకు వందలాది మంది నైట్స్ టెంప్లర్ సభ్యులను సామూహికంగా అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేసి ఉరితీశారు. ఈ రక్తపాతం చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోవడంతో 13వ తేదీ శుక్రవారం అంటే ప్రజల్లో ఒక రకమైన వణుకు మొదలైంది.
13వ సంఖ్య పట్ల ఉన్న విపరీతమైన భయాన్ని సైకాలజీలో త్రిస్కైదేకాఫోబియా అని పిలుస్తారు. దీని ప్రభావం ఎంతలా ఉందంటే..
లిఫ్టుల్లో 13వ అంతస్తు ఉండదు: అనేక విదేశీ భవనాల్లో 12 తర్వాత నేరుగా 14వ అంతస్తు ఉంటుంది.
విమానాల్లో 13వ సీటు: కొన్ని విమానయాన సంస్థలు తమ సీట్ల వరుసలో 13వ నంబర్‌ను తొలగించాయి.
వ్యాపార నష్టాలు: అమెరికా వంటి దేశాల్లో ఈ రోజున జనం బయటకు రావడానికి ప్రయాణాలు చేయడానికి భయపడటం వల్ల బిలియన్ల డాలర్ల వ్యాపార నష్టం జరుగుతుందని అంచనా.
శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞుల ప్రకారం.. 13 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ప్రాచీన కాలం నుండి 12ను పరిపూర్ణతకు చిహ్నంగా చూసేవారు. ఆ పరిపూర్ణతను 13వ సంఖ్య దెబ్బతీస్తుందనే ఒక అపోహే తప్ప.. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. చరిత్రలో జరిగిన కొన్ని ప్రమాదాలు యాదృచ్ఛికమే తప్ప ఆ రోజుకు ఉన్న ప్రత్యేక దురదృష్టం కాదని హేతువాదులు చెబుతుంటారు.