ఉసిళ్ల జీవిత కాలం ఒక్క రోజేనా? వీటి గురించి నమ్మలేని నిజాలు..

వానాకాలంలో కనిపించే ఉసిళ్లు రెక్కలున్న చెదపురుగులు. ఇవి కొత్త పుట్టలను నిర్మించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటి ఆయుష్షు ఒక్కరోజేనన్నది అపోహే. చాలా వరకు చనిపోయినా, కొన్ని జంటలు కొత్త పుట్టలను ఏర్పరుస్తాయి. భారత్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని పోషకమైన ఆహారంగా స్వీకరిస్తారు.

ఉసిళ్ల జీవిత కాలం ఒక్క రోజేనా? వీటి గురించి నమ్మలేని నిజాలు..
Flying Termites

Updated on: Apr 30, 2026 | 4:41 PM

ఇప్పుడు కాదు కానీ.. వానాకాలంలో గుంపులుగా కనిపించే ఎగిరే ఉసిళ్ల గురించి అనేక అపోహలు, ఆసక్తికర వాస్తవాలు ఉన్నాయి. వీటి ఆయుష్షు కేవలం ఒక రోజేనని చాలా మంది భావిస్తారు, అయితే శాస్త్రవేత్తలు దీనిపై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కీటకాలపై పరిశోధనలు జరిపే నిపుణుల ప్రకారం, ఉసిళ్లు ప్రత్యేకమైన కీటకాలు కావు. అవి రెక్కలు మొలిచిన చెదపురుగులే. ఈ రెక్కలున్న చెదపురుగులే కొత్త చెదపుట్టల ఏర్పాటుకు, చెదపురుగుల తరాలు వృద్ధి చెందడానికి మూలకారణం.

తేనెటీగలు, చీమల్లాగే చెదపురుగులు కూడా సామాజిక జీవులు. ఒక పుట్టలో వేల నుంచి లక్షల సంఖ్యలో చెదలు ఉంటాయి. వీటిలో రాజు, రాణి, కూలి, కాపలా భటులు అనే నాలుగు ప్రధాన వర్గాలు ఉంటాయి. నిమిషానికి 25 గుడ్లు పెట్టే రాణి చెదపురుగు ఒక రోజులో వేల గుడ్లు పెడుతుంది, దీని ద్వారానే చెదల పుట్ట విస్తరిస్తుంది. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, తేనెటీగలు, చీమలతో పోలిస్తే చెదపురుగులకు ఒక ప్రత్యేకత ఉంది. మగ చీమ లేదా తేనెటీగ పునరుత్పత్తి తర్వాత చనిపోతుంది, కానీ చెదపురుగుల విషయానికొస్తే, రాజు చెదపురుగు రాణితో ఏళ్లపాటు కలిసి ఉండి పునరుత్పత్తిలో పాల్గొంటుంది, ఎందుకంటే రాణికి వీర్యాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండదు. ఒక చెదల పుట్టలో రాజు, రాణి కాకుండా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి ఆడ, మగ చెదలు కూడా ఉంటాయి. ఈ శ్రేణికి చెందిన చెదలే వానాకాలంలో రెక్కలు తెచ్చుకొని బయటకు ఎగురుతాయి, వీటినే మనం ఉసిళ్లు అంటాం. ఒకవేళ పుట్టలోని రాజు లేదా రాణి చనిపోతే, వాటి స్థానాన్ని భర్తీ చేయడం ఈ ద్వితీయ స్థాయి చెదల విధి. ఇది పుట్ట అనేక తరాలతో చాలా ఏళ్లపాటు మనుగడ సాగించడానికి తోడ్పడుతుంది. అందుకే కొన్ని చెదల పుట్టలు చాలా ఎత్తుగా ఉంటాయి, ఇది వాటి దీర్ఘకాల మనుగడకు నిదర్శనం.

పునరుత్పత్తి ప్రక్రియలో భాగంగా, కొత్త పుట్టలను నిర్మించడానికి ఉసిళ్లు వేల సంఖ్యలో తమ పుట్టల నుంచి బయటకు వస్తాయి. వానాకాలంలో తేమతో కూడిన వాతావరణం ఉసిళ్లు ఎగరడానికి అత్యంత అనుకూలం. వానల కారణంగా మట్టి తడిగా, మెత్తగా మారడం వల్ల జతకట్టిన చెదపురుగుల జంటలకు కొత్త పుట్టను నిర్మించుకోవడం సులభం అవుతుంది.  వానాకాలంలో ఎక్కువ ఆహారం లభించడం కూడా జీవులకు పునరుత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఉసిళ్ల జీవితకాలం ఒక్క రోజేనన్న నమ్మకం అవాస్తవమని నిపుణులు స్పష్టం చేశారు. పునరుత్పత్తి కోసం బయటకు వచ్చే వేల జంటల్లో చాలా వరకు పక్షులు, కప్పలు వంటి ఇతర జీవులకు ఆహారంగా మారడం లేదా వివిధ కారణాలతో చనిపోవడం జరుగుతుంది. తక్కువ సంఖ్యలో మాత్రమే జంటలు కొత్త పుట్టలను విజయవంతంగా నిర్మిస్తాయి. చాలా వరకు చనిపోవడం చూసే ఈ అపోహ పుట్టి ఉండొచ్చని సంబంధిత నిపుణులు తెలిపారు.

మనుషులు కూడా ఉసిళ్లు అధికంగా చనిపోవడానికి ఒక కారణమని మరికొందరు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. భారత్‌లోని అనేక ప్రాంతాల్లో ఉసిళ్లను ఆహారంగా తీసుకునే అలవాటు ఉంది. వానాకాలంలో ఉసిళ్లు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చినప్పుడు గ్రామీణులు వాటిని సేకరించి, ఎండబెట్టి, వేయించి ఆహారంగా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ఉసిళ్లను పోషకాలున్న, రుచికరమైన ఆహారంగా భావించినప్పటికీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనే వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు పెద్దగా లేవని పోషకాహార నిపుణులు తెలిపారు. అయితే ఆరోగ్యకరమైన రీతిలో వీటిని వండి తింటే ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు.

Also Read: టమాటా పొలంలో పనిచేస్తున్న రైతుకు ఇవి కనిపించాయ్.. ఏంటో తెలుసా..? 

 

Follow Us