చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.. కోటీశ్వరులు తినే కూరగా మారనున్న కోడికూర.. ప్రస్తుతం ధర ఎంతంటే..?

|

Apr 06, 2021 | 11:34 AM

కోడికూర ఇకపై కోటీశ్వరులు తినే కూరగా మారనుందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. మార్కెట్‌లో చికెన్‌ రేటు ఒక్కసారిగా కొండెక్కింది.

చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.. కోటీశ్వరులు తినే కూరగా మారనున్న కోడికూర.. ప్రస్తుతం ధర ఎంతంటే..?
Follow us on

chicken rates raises: కోడికూర ఇకపై కోటీశ్వరులు తినే కూరగా మారనుందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. మార్కెట్‌లో చికెన్‌ రేటు ఒక్కసారిగా కొండెక్కింది. ఏకంగా బహిరంగ మార్కెట్‌లో 300లకు పైగా ధర పలుకుతోంది.

బర్డ్‌ ఫ్లూ భయంతో గతంలో బావురుమన్న పౌల్ట్రీ మార్కెట్‌, ఇప్పుడు కళకళలాడుతోంది. డిమాండ్‌కు తగినంత సప్లయ్‌ లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి వేసవి కాలం తోడవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. విజయవాడలోని బహిరంగ మార్కెట్‌లో చికెన్‌ ధర కేజీ 310 రూపాయలు పలుకుతోంది. బర్డ్‌ ఫ్లూ వల్ల కోళ్ల పెంపకం భారీగా తగ్గిందని, అయితే ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో సప్లయ్‌ లేక చికెన్‌ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.

మరోవైపు ఒక్కసారిగా చికెన్‌ ధర రూ. 300 దాటడంతో ఇటు చికెన్‌ప్రియులు అవాక్కవుతున్నారు. కేజీ కొనుగోలు చేసేవారు కాస్తా అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. అటు నాన్‌వెజ్‌ క్యాటరింగ్‌ చేసేవారు కూడా చికెన్‌ ధర పెరగడంతో సతమతమవుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత పెరిగడం కూడా రేటు పెరుగుదలకు ఓ కారణంగా పౌల్ట్రీ రంగ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా ఈ సీజన్‌లో కోళ్ల ఉత్పత్తి తగ్గుతుందని చెప్పారు. వేసవిలో చికెన్ ధరలు పెరగడం సాధారణమేనని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ దారిలోనే గుడ్ల రేట్లు కూడా పెరిగాయి. నాలుగు నెలల క్రితం వరకు కిలో చికెన్ ధర వంద లోపే ఉండేది. పెరిగిన ధరతో సామాన్యులు నాన్ వెజ్ మాట ఎత్తితేనే మండిపడుతున్నారు.
Read Also..