
పాము అంటేనే చాలా మందికి భయం. అందులోనూ కోబ్రా పేరు వినగానే గుండె వేగం పెరుగుతుంది. పడగ విప్పి బుసకొడుతూ కనిపించే కోబ్రా గురించి అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి – కోబ్రా విషాన్ని దూరం నుంచి చిమ్ముతుందా? ఒకవేళ ఆ విషం మనపై పడితే ఏమవుతుంది?. నిజానికి ప్రపంచంలో కొన్ని ప్రత్యేక జాతుల కోబ్రాలు విషాన్ని చిమ్మగలవు. వీటిని స్పిట్టింగ్ కోబ్రాలు అని పిలుస్తారు. ప్రమాదం ఎదురైనప్పుడు ఇవి తమ కోరల నుంచి విషాన్ని ఒత్తిడితో బయటకు పంపి శత్రువు కళ్ల వైపు గురి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 2 నుంచి 3 మీటర్ల దూరం వరకు కూడా విషాన్ని చిమ్మగలవని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఇండియన్ కోబ్రా సాధారణంగా ఇలా విషాన్ని చిమ్మదు. ఇది ప్రధానంగా కాటు ద్వారా మాత్రమే విషాన్ని శరీరంలోకి పంపుతుంది.
పాము విషం చర్మంపై పడినంత మాత్రాన సాధారణంగా ప్రాణాపాయం ఉండదు. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం విషాన్ని నేరుగా శరీరంలోకి అనుమతించదు. అయితే చర్మంపై గాయాలు, కోతలు ఉంటే మంట లేదా చికాకు కలిగే అవకాశం ఉంటుంది. కానీ విషం కళ్లలో పడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తీవ్రమైన మంట, నొప్పి, కంటి ఎర్రబడటం, వాపు, చూపు మందగించడం వంటి సమస్యలు రావచ్చు. చికిత్స ఆలస్యం అయితే కంటి చూపుపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. విషం కళ్లలో పడితే.. వెంటనే భయపడకుండా కళ్లను శుభ్రమైన నీటితో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కడగాలి. కళ్లను రుద్దకూడదు. అనంతరం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చాలా మంది అనుకునేలా ప్రతి కోబ్రా విషాన్ని చిమ్మదు. విషాన్ని చిమ్మే సామర్థ్యం కొన్ని ప్రత్యేక జాతులకు మాత్రమే ఉంటుంది. వాటి లక్ష్యం కూడా మనుషులను చంపడం కాదు; శత్రువును భయపెట్టి తప్పించుకోవడమే. అందుకే కోబ్రాను చూసినప్పుడు దానికి దూరంగా ఉండటం, రెచ్చగొట్టకపోవడం ఉత్తమం. పాములు సాధారణంగా మనుషులపై దాడి చేయాలని కాదు, తమను తాము రక్షించుకోవడానికే ప్రయత్నిస్తాయి. భయం, అపోహల కంటే సరైన అవగాహనే పాముల విషయంలో మనకు రక్షణ కల్పిస్తుంది.
పాములకు శత్రువు.. అడవుల యోధుడు.. ముంగిస గురించి ఆసక్తికర విషయాలు