సెల్యూట్.. తీరని దుఃఖాన్ని దిగమింగుకుని ఔదార్యం చాటుకున్న కుటుంబం..!

| Edited By: Balaraju Goud

Nov 19, 2024 | 9:32 PM

విజయవంతంగా అవయవాలను సేకరించి గ్రీన్‌ ఛానల్ ద్వారా అవయవాలు అత్యవసరంగా గమ్యస్థానాలకు చేర్చారు.

సెల్యూట్.. తీరని దుఃఖాన్ని దిగమింగుకుని ఔదార్యం చాటుకున్న కుటుంబం..!
Organs Sonation In Vizag
Follow us on

తాను మ‌ర‌ణించి… మ‌రో నలుగురులోజీవించాడు ఓ వ్యక్తి.. తీరని దుఃఖంలోనూ ఆ కుటుంబం చూపిన ఔదార్యం అందరిలో స్ఫూర్తినిచ్చింది. స్వయంగా నివాళులర్పించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. మృతదేహానికి గౌరవ వందనం సమర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందించారు.

తాను చ‌నిపోతూ మ‌రో నలుగురు ప్రాణాలు కాపాడారు విశాఖకు చెందిన వ్యక్తి. నవంబర్‌ 17వ తేదీన దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయారు. దీనితో స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్‌లో తీవ్ర రక్తస్రావం అవుతుందని గుర్తించారు. అత‌న్ని ర‌క్షించ‌డానికి రెండు రోజుల పాటు వైద్యులు శ్రమించారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్య బృందం బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.

ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై వైద్య బృందం వారి కుటుంబస‌భ్యులకు, బంధువుల‌కు అవ‌గాహ‌న‌ కల్పించారు. అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ ప్రతినిధులకు అందించారు. రామారావు శరీరంలోని ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, అవయవాలను సేకరించేందుకు అనుమతి జారీ చేశారు. సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం నలుగురికి కేటాయించారు. అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.

గౌరవ వందనం.. కుటుంబానికి ప్రశంసా పత్రం..

నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన రామారావు మృతదేహానికి జిల్లా కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 95 ప్రకారం రామారావు మృతదేహానికి గౌరవ వందనం చేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రం తోపాటు అంత్యక్రియలు నిమిత్తం పదివేల రూపాయలను కలెక్టర్ అందజేశారు.

గ్రీన్ ఛానల్ తో అవయవాల తరలింపు..

విజయవంతంగా అవయవాలను సేకరించి గ్రీన్‌ ఛానల్ ద్వారా అవయవాలు అత్యవసరంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో రామారావు చ‌నిపోతూ మ‌రో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గ‌ర్వంగా ఉంద‌ని మృతిని కుటుంబ స‌భ్యులు తెలిపారు. అవయవ దానంతో ప్రజల్లో అవగాహన పెరగాలని కోరుతున్నారు జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…