Dangerous Snake: మన దగ్గర కనిపించే ఈ పాము కాటేస్తే గాట్లు పడవు.. వాపు, నొప్పి కూడా ఉండదు.. కానీ.. ఆలస్యమైతే ఖతమే..

|

Jun 22, 2024 | 4:48 PM

సాధార‌ణంగా పాము కాటు వేస్తే నోటివెంట నుర‌గ‌లు రావ‌డం, న‌రాలు చ‌చ్చుబ‌డిపోవ‌డం లాంటి కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి. కానీ, కొన్నిర‌కాల పాములు కాటు వేస్తే మాత్రం ఇలా ఉండ‌క‌పోగా.. వేరే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఆలస్యమైతే.. పరిస్థితి తీవ్రంగా మారుతుందని వెల్లడించారు.

Dangerous Snake: మన దగ్గర కనిపించే ఈ పాము కాటేస్తే గాట్లు పడవు.. వాపు, నొప్పి కూడా ఉండదు.. కానీ.. ఆలస్యమైతే ఖతమే..
Common krait - Katla Pamu
Follow us on

సాధార‌ణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు ప‌డ‌తాయి. అలాగే కాటు ప‌డిన ప్రాంతంలో వాపు, నొప్పి కూడా ఉంటాయి. కానీ క‌ట్ల‌పాము కాటేస్తే మాత్రం ఇవేవీ క‌నిపించ‌వు. కానీ.. ఆ త‌ర్వాత కొంత‌సేప‌టికి వాంతులు, క‌డుపునొప్పి, గొంతు నొప్పి లాంటి సాధార‌ణ ల‌క్ష‌ణాలుంటాయి. ఇంకా ఎక్కువ స‌మ‌యం దాటితే.. అప్పుడు న‌రాల బ‌ల‌హీన‌త‌, ఊపిరి అంద‌క‌పోవ‌డం లాంటివి క‌నిపిస్తాయి. అందుకే వీటిని పాము కాటుగా త‌ల్లిదండ్రులే కాదు, సాధార‌ణ వైద్యులు కూడా గుర్తించ‌లేరు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే అనంత‌పురంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను పిల్ల‌ల వైద్య నిపుణుడు డాక్ట‌ర్ ఎ. మ‌హేష్ మీడియాకు వెల్లడించారు..

12 ఏళ్ల బాలుడు ఊపిరి స‌రిగా అంద‌ని ప‌రిస్థితిలో అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అప్ప‌టికి అత‌డి ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ కేవ‌లం 66% మాత్ర‌మే ఉంది. చెస్ట్ ఎక్స్‌రే తీసి చూస్తే, న్యుమోనియా ల‌క్ష‌ణాల లాంటివి కొన్ని క‌నిపించాయి. కానీ, ఒక రోజు ముందువ‌ర‌కు బాబుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంటే న్యుమోనియాలో క‌నిపించే జ్వ‌రం, ద‌గ్గు, జలుబు లాంటివి ఒక్క‌టి కూడా లేవు. కానీ ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ బాగా త‌క్కువ‌గా ఉండ‌టంతో ముందుగా వెంటిలేట‌ర్ అమ‌ర్చి, చికిత్స మొద‌లుపెట్టామని తెలిపారు. ఆ త‌ర్వాత అస‌లు ఏం జ‌రిగింద‌ని వైద్యులు ఆరా తీశారు..

పాము కాటుకు చికిత్స పొందిన బాలుడు..

కట్ల పాము కాటేసిన తర్వాత..

ముందుగా అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో బాబుకు తీవ్రంగా క‌డుపునొప్పి వ‌చ్చింది. ఆ త‌ర్వాత వాంతులు కావ‌డం మొదలైంది.. తెల్ల‌వారు జామున గంట‌ల స‌మ‌యంలో గొంతు కూడా నొప్పి అనిపించ‌డంతో స్థానికంగా ఉన్న ఒక ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ల‌క్ష‌ణాలు చూసిన అక్క‌డి వైద్యులు పేగుల్లో ఏదో స‌మ‌స్య అయి ఉంటుంద‌ని భావించి, అందుకు సంబంధించిన మందులు ఇచ్చారు. త‌ర్వాత కొన్ని గంట‌ల పాటు బాగానే ఉన్న బాబుకు.. ఆ త‌ర్వాత ఊపిరి అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దాంతో వెంట‌నే కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ చూస్తే త‌ప్ప‌నిస‌రిగా బాబును పాము కాటేసి ఉంటుంద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు..

సాధార‌ణంగా పాము కాటు వేస్తే నోటివెంట నుర‌గ‌లు రావ‌డం, న‌రాలు చ‌చ్చుబ‌డిపోవ‌డం లాంటి కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి. కానీ, కొన్నిర‌కాల పాములు కాటు వేస్తే మాత్రం ఇలా ఉండ‌క‌పోగా.. వేరే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయని వైద్యులు తెలిపారు.

పాము కాటు అని నిర్ధార‌ణ కావ‌డంతో బాబుకు ముందుగా పాము విషానికి విరుగుడు అయిన ఏఎస్‌వీ (యాంటీ స్నేక్ వీనం) ఇంజెక్ష‌న్లు ఇచ్చి, దాంతోపాటు కాల్షియం కూడా ఇవ్వ‌డంతో రెండు రోజుల త‌ర్వాత బాబు పూర్తిగా కోలుకున్నాడు. అత‌డి ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ కూడా సాధార‌ణ స్థాయికి రావ‌డంతో వెంటిలేట‌ర్ తొల‌గించి, రెండు రోజుల్లోనే డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు.

కట్ల పాము కాటేస్తే.. కనిపించే లక్షణాలివే..

గ్రామీణ ప్రాంతాల్లో పిల్ల‌లు ఎవ‌రైనా కింద ప‌డుకుని, తెల్ల‌వారి లేవ‌గానే తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌పడుతూ, ఆ త‌ర్వాత గొంతునొప్పి, వాంతులు, న‌రాల బ‌ల‌హీన‌త లాంటివి కూడా మొద‌లైతే దాన్ని పాముకాటుగా అనుమానించి, వెంట‌నే త‌గిన చికిత్స అంద‌జేయాలి. ఆల‌స్యం అయ్యేకొద్దీ ప‌రిస్థితి విష‌మిస్తుందని.. అని డాక్ట‌ర్ మ‌హేష్ వివ‌రించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..