మీ ఆధార్ కార్డులు ఇతరులు వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. తెలుసుకోండి ఇలా..
మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా..? ఇతరులు ఎవరైనా మీకు తెలియకుండా ఉపయోగిస్తున్నారా..? ఇకపై తెలుసుకోవడం చాలా సులభం.
Aadhaar card Authentication History: మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా..? ఇతరులు ఎవరైనా మీకు తెలియకుండా ఉపయోగిస్తున్నారా..? ఇకపై తెలుసుకోవడం చాలా సులభం అంటున్నారు నిపుణులు… దేశంలో ఇప్పుడు ప్రతి చిన్న పనికీ ఆధార్ కార్డే ఆధారమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరీ తప్పనిసరిగా మారింది. దేనికైనా అదే ఆధారమైన నేపధ్యంలో ఆధార్‌ను ఎన్నిసార్లు ఎప్పుడు ఎలా వాడారో తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం
బ్యాంకు ఖాతా తెరవాలన్నా, మొబైల్ సిమ్ తీసుకోవాలనుకున్నా, ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్నా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికలో సైతం అన్నింటికీ ఒకటే ఆధారం. అదే ఆధార్ కార్డు. చాలాసార్లు మీరెక్కడో ఇచ్చిన ఆదార్ కార్డు… మరెక్కడో మిస్ యూజ్ కూడా అయ్యే పరిస్థితి ఉంది. ఆధార్ జిరాక్స్‌పై మీరు సంతకం చేసి ఎక్కడో ఇస్తుంటారు. అది కాస్తా చేతులు మారి మరెక్కడో ఉపయోగపడుతుంటుంది. అందుకే మీరు గత ఆరు నెలల్లో మీ ఆధార్ కార్డును ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారనేది ఇకపై సులువుగా తెలుసుకోవచ్చు. కొత్తగా ఈ సదుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఇది తెలుసుకోవాలంటే మీ ఆధార్ కార్డును ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకుని ఉండాలని యూఐడీఏఐ పేర్కొంది.
ఆధార్ కార్డు ఎప్పుడు వాడారో లేదో ఇలా తెలుసుకోవచ్చుః
- ముందుగా ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ (Aadhaar card Authentication History)పేజ్ ఓపెన్ చేయాలి.
- అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి..అక్కడ కన్పించే సెక్యూరిటీ కోడ్ నమోదు చేయాలి.
- ఆ తరువాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. మీ మొబైల్ నెంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది.
- ఇక్కడ కన్పించే పేజీలో ఎన్ని లావాదేవీలు చూడాలనుకుంటున్నారు.. ఎంత వ్యవధిలోవి చూడాలనుకుంటున్నారు వంటి వివరాల్ని నమోదు చేయాలి.
- మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
- వెంటనే తేదీ , సమయం, ఆధార్ కార్డు అథెంటికేషన్ వివరాలు స్క్రీన్ పై కన్పిస్తాయి.
- దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోవచ్చు.
ఇది తెలుసుకోవడం వల్ల మన ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించారనేది తెలిసిపోతుంది. మన ఆధార్ కార్డును మనం కాకుండా ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తున్నారా అనేది తెలుస్తుంది. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మన ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. అయితే, ఈ వివరాలు తెలుసుకోవాలంటే మీ మైబైల్ నెంబర్ తప్పనిసరిగా రిజిస్టర్ కావల్సి ఉంటుంది.
ఇదీ చదవండిః మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌తో సహా 50మందిపై కేసు నమోదు.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆరోపణ