
ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తాయి. కొన్ని కలలు బాగుంటాయి.. మరికొన్ని పీడకలలు (భయంకరమైన కలలు) ఉంటాయి. అయితే తరచూ పీడకలలు వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మన శరీరంలో లోతైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (EAN) చేసిన ఒక పరిశోధన ప్రకారం.. తరచూ పీడకలలు వచ్చే వారికి త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంది. అలాగే వారు త్వరగా చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువ. వారానికి పీడకలలు వచ్చే వారిలో.. అకాల మరణం వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని ఈ అధ్యయనం చెబుతోంది.
ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కి చెందిన శాస్త్రవేత్తల ప్రకారం.. మన మెదడు నిద్రలో వచ్చే కలలను నిజ జీవితం నుంచి వేరు చేయలేదు. అందుకే పీడకలల సమయంలో మనకు చెమటలు పట్టడం, గుండె వేగం పెరగడం, సరిగా ఊపిరి ఆడకపోవడం వంటివి జరుగుతాయి. నిద్రలో కలిగే ఒత్తిడి, బయట మనం అనుభవించే ఒత్తిడి కంటే ఎక్కువగా ఉంటుంది.
పీడకలల వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ మన శరీర కణాల వృద్ధాప్యానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే పీడకలల వల్ల వచ్చే ఒత్తిడి, వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.
పీడకలలు మనసుపై ఒత్తిడి పెంచడమే కాకుండా.. నిద్ర నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. దాని వల్ల రాత్రివేళ మన శరీరంలో జరిగే మరమ్మత్తులు సరిగా జరగవు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల మన శరీర కణాలు వేగంగా వృద్ధాప్యానికి గురవుతాయి.
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి టెలోమియర్‌ల (కణాల చివర ఉండే భాగాలు) పొడవును పరిశీలించారు. టెలోమియర్‌లు తగ్గితే.. శారీరక వయస్సు పెరుగుతోందని అర్థం. తరచూ పీడకలలు వచ్చే వారిలో టెలోమియర్‌లు చిన్నగా ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా పీడకలలకు.. త్వరగా వచ్చే వృద్ధాప్యానికి మధ్య బలమైన సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.
వారానికి పీడకలలు వస్తే చాలా ప్రమాదం. కానీ నెలకొకసారి పీడకలలు వచ్చినా దాన్ని ఒక హెచ్చరికగా భావించాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)