
మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడే భోజనం పూర్తి చేస్తారు.. కానీ మరో పది నిమిషాలకే ఏదైనా స్నాక్స్ తింటే బాగుండు అనిపిస్తుంది. టీవీ చూస్తున్నా, పనిలో ఉన్నా, చివరకు నిద్రపోవడానికి ముందు కూడా మెదడులో ఏదో ఒక వంటకం తలపులు మెదులుతూనే ఉన్నాయా? అయితే మీరు ‘ఫుడ్ నాయిస్’ బారిన పడ్డారని అర్థం. ఇది ఆకలి కాదు, ఒక రకమైన మానసిక స్థితి. దీని వల్ల తెలియకుండానే మీరు అధిక బరువు, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అసలు ఈ ఫుడ్ నాయిస్ అంటే ఏంటి? అది మన ప్రవర్తనను ఎలా మారుస్తుందో తెలుసుకుందాం..
సాధారణంగా మనకు ఆకలి వేసినప్పుడు శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. కానీ ఫుడ్ నాయిస్ ఉన్నవారిలో ఆకలితో సంబంధం లేకుండా మెదడు నిరంతరం “ఏదైనా తిను.. అది తింటే బాగుంటుంది.. ఇది తింటే బాగుంటుంది” అని అరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీన్నే నిపుణులు ‘ఫుడ్ ప్రీఆక్యుపేషన్’ అని కూడా అంటారు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నా సరే, మీ మెదడులో బిర్యానీనో లేదా పిజ్జానో మెదులుతూనే ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు ఈ ‘నాయిస్’ మరింత పెరుగుతుంది. ఆ సమయంలో మీరు కడుపు నింపుకోవడానికి కాదు, ఆ ఆలోచనను ఆపడానికి తింటారు. ఆకలి లేకపోయినా తింటూ ఉండటం వల్ల క్యాలరీలు పెరిగిపోయి ఊబకాయం వస్తుంది. దీనివల్ల డయాబెటిస్ వంటి సమస్యలు చుట్టుముడతాయి.
మన మెదడులోని డోపమైన్ అనే హార్మోన్ దీనికి ప్రధాన కారణం. మనం ఏదైనా రుచికరమైన ఆహారం తిన్నప్పుడు మెదడుకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కోసం మెదడు పదే పదే మిమ్మల్ని ఆహారం వైపు ఉసిగొల్పుతుంది. కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల లేదా సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ ఫుడ్ నాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ముఖ్యంగా తినేటప్పుడు టీవీ, ఫోన్ చూడకుండా కేవలం ఆహారంపైనే దృష్టి పెట్టకూడదు. మీ ఆహారంలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది, తద్వారా అనవసర ఆలోచనలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ చేయాలి. ఒక్కోసారి దాహాన్ని కూడా మెదడు ఆకలిగా పొరబడుతుంది. అందుకే నీరు ఎక్కువగా తాగడం మేలు.
తిండి మీద ధ్యాస ఉండటం తప్పు కాదు, కానీ అది మీ నియంత్రణ దాటిపోతేనే ప్రమాదం. ఒకవేళ మీరు కూడా నిరంతరం ఈ ‘ఫుడ్ నాయిస్’తో ఇబ్బంది పడుతుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. మీ మెదడు చేసే గోలను ఆపండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!