conjunctivitis: కండ్ల కలకతో తస్మాత్ జాగ్రత్త.. ఇంట్లో ఒకరికి వస్తే అందరినీ చుట్టేస్తుంది.. ఇలా చేస్తే సింపుల్ తగ్గించుకోవచ్చు..

బ్యాక్టీరియా, వైరస్ల వల్ల కండ్ల కలక వస్తే మీరు జాగ్రత్త పడాలి. మీ నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వేరే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇది మరింత వ్యాప్తి చెందకుండా, నివారించేందుకు పలు సూచనలు నిపుణులు అందిస్తున్నారు. అవేంటో చూద్దాం రండి..

conjunctivitis: కండ్ల కలకతో తస్మాత్ జాగ్రత్త.. ఇంట్లో ఒకరికి వస్తే అందరినీ చుట్టేస్తుంది.. ఇలా చేస్తే సింపుల్ తగ్గించుకోవచ్చు..
Eye Care

Updated on: Jul 27, 2023 | 3:53 PM

వర్షాలు కుమ్మేస్తున్నాయి. మబ్బులు పట్టిన వాతావరణం చాలా మందికి ఆహ్లాదాన్ని పంచుతోంది. అదే సమయంలో విసుగును తెప్పిస్తుంది. మరో వైపు సీజనల్ వ్యాధులను వ్యాపింపజేస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఓ వ్యాధి బారిన అధికంగా పడుతున్నారు. ఎర్రగా మారిన కళ్లతో ఆస్పత్రులకు చేరుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణమే. అధిక తేమతో కూడిన వాతావరణంతో కళ్లు ఇన్ ఫెక్షన్స్ బారిన పడుతున్నాయి. దీనిని వైద్య పరిభాషలో కండ్లకలక(కంజెక్టివైటీస్‌) అని పిలుస్తారు. లేదా పింక్ ఐస్ అంటారు. ఇది ప్రతి ఏడాది వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల తర్వాత అధికంగా వ్యాప్తి చెందే వ్యాధి. కొన్ని రిపోర్టుల ఆధారంగా పూణే నగరంలో ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 2,000 మందికి పైగా కండ్ల కలక సమస్యతో ఆస్పత్రుల్లో చేరినట్లు చెబుతున్నారు. అలాగే ఢిల్లీలో కూడా గతేడాది కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఈ కండ్ల కలక వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఎడతెగని వర్షం, అధిక తేమతో కూడిన వాతావరణం ఇలాంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

వర్షాకాలంలో కళ్ల కలక ఎందుకు వస్తుంది..

సాధారణంగా వ్యక్తుల ముక్కు, సైనస్ లలో నివసించే బ్యాక్టీరియా కారణంగా ఈ కండ్ల కలక వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ లకు వాహకంలా పనిచేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా ప్రయాణించడానికి ఉపకరిస్తుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్ లా కారణంగా వ్యాపించే కండ్ల కలక అంటు వ్యాధి. ఇది సోకినప్పుడు కళ్ల చుట్టూ ఎరుపు, నీరు, దురద, గుచ్చుకోవడం, నొప్పి, వాపు వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కండ్లకలక ఉన్న చాలా మంది రోగులు కొంత వైరల్ జలుబు, దగ్గు, జ్వరంతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మరోరకమైన కండ్ల కలక కూడా ఉంది. ఇది పుప్పొడి, సిగరెట్ పొగ, పూల్ క్లోరిన్, కారు పొగలు, వాతావరణంలో మరేదైనా ప్రతి చర్య కారణంగా అలెర్జీ వచ్చి కండ్ల కలక రావొచ్చు. ఇది అంటు వ్యాధి కాదు. ఈ తరహా కండ్ల కలక కూడా పై చెప్పిన లక్షణాలను చూపిస్తుంది. మీ కళ్లు దురదగా, ఎర్రగా, నీరు ఎక్కువ కారుతూ కనిపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపించదు.

మీరు ఒకవేళ బ్యాక్టీరియా, వైరస్ల వల్ల కండ్ల కలక వస్తే మీరు జాగ్రత్త పడాలి. మీ నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వేరే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇది మరింత వ్యాప్తి చెందకుండా, నివారించేందుకు పలు సూచనలు నిపుణులు అందిస్తున్నారు. అవేంటో చూద్దాం రండి..

ఇవి కూడా చదవండి

సరైన పరిశుభ్రత పాటించాలి.. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా సబ్బు, నీటితో మీ చేతులను శుభ్రంగా కడుగుకోవాలి. మురికి చేతులతో మీ కళ్లను తాకకూడదు.

మీ కళ్లను రుద్దవద్దు.. మీకు ఇన్ఫెక్షన్ సోకితే, కళ్లలో ఇబ్బంది ఉన్నా వాటిని ఎక్కువగా తాకకూడదు. అలా రుద్దితే ఇన్ఫెక్షన్ మరింత అధికమయ్యే అవకాశం ఉంటుంది.

వెచ్చదనాన్ని అందించండి.. మీ కంటి ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి కంటికి ఆవిరి పట్టించండి. శుభ్రమైన వస్త్రంతో గానీ, అరచేతులతో గానీ వెచ్చదనాన్ని కంటికి తగిలేలా చూడాలి.

మేకప్ మానుకోవాలి.. కండ్ల కలక వచ్చినప్పడు నేత్రాలకు ఎటువంటి మేకప్ వేయవద్దు. వాటిల్లో ఉండే రసాయనాలు మీ కళ్ల పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. అలాగే చికిత్స చేసినా పరిస్థితి అదుపులోకి రావడానికి సమయం పడుతుంది.

వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు.. మీ కళ్లకు తాకే టవల్ లేదా కర్చీఫ్ వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు.

ఈత కొట్టడం మానుకోండి.. వర్షాకాలంలో ఈ కొలనుకు దూరంగా ఉండటం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..