Health: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. అధిక కొలెస్ట్రాల్‌ కావొచ్చు

|

Sep 24, 2023 | 9:30 AM

రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే ఈ సమస్య వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతోంది. అయితే శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే పసిగడితే చికిత్స తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లు...

Health: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. అధిక కొలెస్ట్రాల్‌ కావొచ్చు
High Cholesterol
Follow us on

మారుతోన్న జీవనశైలి కారణంగా మనుషుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు రావడం వెరసి రోగాల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల రోజురోజుకీ పెరిగిపోతోంది. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే ఈ సమస్య వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతోంది. అయితే శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే పసిగడితే చికిత్స తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లు తెలిపే ఆ ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అధిక కొలెస్ట్రాల్‌ ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణం.. కాళ్లు భారంగా అనిపించడం. అంతేకాదు నిత్యం నొప్పిగా ఉన్నా శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతున్నట్లు భావించాలి. ముఖ్యంగా తొడల భాగంగా అధికంగా భారంగా అనిపించినా, కాస్త దూరం నడవగానే కాళ్లు నొప్పి ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లిపిడ్‌ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

* ఎక్కువ సేపు కదలకుండా ఉంటే కాళ్లు, లేదా చేతులు తిమ్మిరం పట్టడం సర్వసాధారణమైన విషయమే. అయితే తరచూ ఈ సమస్య వస్తే మాత్రం తేలికగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మడమ ప్రాంతంలో నిత్యం తిమ్మిరి వస్తే అధిక కొలెస్ట్రాల్‌ వల్లేనని అనుమానించాలి. రాత్రిపూట అధికంగా తిమ్మిర్లు వస్తే కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

* వాతావరణం మరీ చల్లగా ఉన్న సందర్భాలను మినహాయిస్తే.. పాదాలు చల్లగా మారితే జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా పాదాలు చల్లగా మారితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లేనని భావించాలి. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

* చర్మం రంగులో అనూహ్యమైన మార్పులు కనిపిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు భారీగా పెరిగినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ధమనుల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతే రక్త ప్రవహానికి అడ్డు తగులుతుంది. దీని వల్ల శరీరంలోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరగదు. శరీరం రంగు మారడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పాలి.

* శరీరంలో ఏదైనా ప్రాంతంలో గాయం త్వరగా మానకపోయినా ఆ ప్రాంతానికి రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని అర్థం. శరీరంలో కొవ్వు పేరుకుపోతే ఇలాంటి సమస్యే వస్తుంది. కాబట్టి గాయాలు త్వరగా నయంకాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నట్లేనని నిర్ధారణకు రావడం కష్టమే. ఆరోగ్యం విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..