AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Toys: పిల్లల ప్రపంచంలోకి ‘ఏఐ బొమ్మలు’.. తోడుగా ఉంటున్నాయా? తోడేళ్లలా మారుతున్నాయా?

లండన్‌కు చెందిన డిజైన్ నిపుణురాలు జో బర్నార్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన అధ్యయనాల ప్రకారం, ఏఐ బొమ్మలు పిల్లల భావోద్వేగాలను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలపై వీటి ప్రభావం గందరగోళంగా ఉంటోంది. నిజ ప్రపంచం సంక్లిష్టమైనది మరియు అనూహ్యమైనది. అసంపూర్ణమైన సమాచారంతో పనిచేసే ఏఐ బొమ్మలు పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేయలేవు. టెక్నాలజీని ఒక పరిమితి వరకు మాత్రమే అనుమతించి, చిన్నారుల సహజమైన బాల్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

AI Toys: పిల్లల ప్రపంచంలోకి ‘ఏఐ బొమ్మలు’.. తోడుగా ఉంటున్నాయా? తోడేళ్లలా మారుతున్నాయా?
Ai Toys.jpg
Nikhil
|

Updated on: Mar 27, 2026 | 6:20 AM

Share

చిన్నారుల ప్రపంచం ఎంతో ముగ్ధంగా, స్వచ్ఛంగా ఉంటుంది. వారు ఆడుకుంటారు, అలుగుతారు, తమదైన భాషలో ఊహాజనిత స్నేహితులతో మాట్లాడుతుంటారు. అయితే, ఇప్పుడు ఆ చిట్టిపొట్టి మాటల ప్రపంచంలోకి ఏఐ టాయ్స్ అడుగుపెట్టాయి. పిల్లల గొంతును గుర్తుపట్టడం, వారు అడిగిన వాటికి సమాధానాలివ్వడం వంటి ఫీచర్లతో ఇవి అలరిస్తున్నాయి. వినడానికి ఇది ఒక గొప్ప ఆవిష్కరణలా అనిపించినా, ఈ కృత్రిమ బొమ్మల వెనుక పిల్లల సహజమైన ఎదుగుదలకు ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

స్నేహానికి, ఏఐకి మధ్య తేడా..

మానవ సంబంధాల్లో గొడవలు, సర్దుబాట్లు, వివిధ రకాల భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఏఐ బొమ్మలు ఎప్పుడూ సహనంగా, స్నేహంగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. ఒక పిల్లవాడు బొమ్మతో ఎంత దారుణంగా ప్రవర్తించినా అది తిరిగి ప్రేమగానే మాట్లాడుతుంది. ఇది వాస్తవ ప్రపంచానికి పూర్తి విరుద్ధం. దీనివల్ల పిల్లలు బయటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలియక ఇబ్బంది పడతారు. కేంబ్రిడ్జ్ అధ్యయనంలో ‘గాబో’ అనే ఏఐ బొమ్మను పరిశీలించినప్పుడు, ఒక చిన్నారి “నాకు బాధగా ఉంది” అని చెబితే, అది “నేను సంతోషంగా ఉండే రోబోని, పద ఆడుకుందాం” అని బదులిచ్చింది. అంటే పిల్లల బాధను అది గుర్తించలేకపోయింది.

మేధోవికాసంపై ప్రభావం

పిల్లలు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటివి తోటి పిల్లలతో ఆడుకున్నప్పుడే అలవడతాయి. కానీ నిరంతరం సమాధానాలిచ్చే ఏఐ బొమ్మలపై అతిగా ఆధారపడటం వల్ల ప్రతి చిన్న విషయానికి బొమ్మనే అడగడం వల్ల పిల్లలలో స్వతంత్రంగా ఆలోచించే శక్తి తగ్గుతుంది. నిరంతర సంభాషణలు ఏఐతోనే జరగడం వల్ల మెదడులోని సామాజిక అభివృద్ధికి సంబంధించిన భాగాలు చురుగ్గా పని చేయడం ఆగిపోయే ప్రమాదం ఉంది.

తల్లిదండ్రులకు సూచనలు

పరిశోధకులు తల్లిదండ్రులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏఐ బొమ్మలను పిల్లలకు ఇచ్చేటప్పుడు అవి అందరికీ కనిపించే ప్రదేశంలోనే ఉండాలి. ఆ బొమ్మల ‘గోప్యతా విధానాలను’ జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే అవి పిల్లల మాటలను రికార్డ్ చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ ప్రపంచం కంటే నిజమైన ఆటపాటలకు, తోటి పిల్లలతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

Follow Us