Mutton Liver: మటన్ లివర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వారికి మాత్రం డేంజరే..!

మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది, ఇది రక్తహీనతను తగ్గించి, శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ అందేలా చేస్తుంది. కానీ దీనిని కొన్ని సమస్యలు ఉన్నవారు అతిగా తింటే అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే సమయంలో లివర్ తినే అలవాటున్న వారికి దీని వల్ల ఎలాంటి లాభనష్టాలున్నాయో తెలుసుకోండి.

Mutton Liver: మటన్ లివర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వారికి మాత్రం డేంజరే..!
Mutton Liver Fry Health Benefits

Updated on: Apr 10, 2025 | 12:42 PM

ఆదివారం వచ్చిందంటే చాలు, మాంసాహార దుకాణాలు జనంతో నిండిపోతాయి. మాంసం ఇష్టపడేవారికి ఆ రోజు నాన్-వెజ్ లేకుంటే రోజు గడవదు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సేవలు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు రోజూ బిర్యానీ, నాన్-వెజ్ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒక్క క్లిక్‌తో ఇంటికి రుచికరమైన వంటకాలు చేరుతున్నాయి. పండగలు, శుభకార్యాల్లో కూడా నాన్-వెజ్ వండడం సర్వసాధారణంగా మారింది. ఇక మాంసాహారంలో మటన్ లివర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది దీన్ని ఫ్రై చేసి లేదా వండుకుని తింటారు. కానీ, మటన్ లివర్ తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఎన్నో ఆరోగ్య లాభాలు

మటన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తం పెరగడానికి, శరీరానికి ఆక్సిజన్ సరఫరా సజావుగా జరగడానికి దోహదపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి దీన్ని ఎక్కువగా తినమని డాక్టర్లు సూచిస్తారు. అలాగే, ఇందులోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీన్ని తరచూ తినేవారికి కంటి సమస్యలు సులభంగా రావని వైద్య నిపుణులు అంటున్నారు. జింక్, కాపర్ వంటి ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు, విటమిన్ బి-12 రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు నరాల బలహీనతను తగ్గిస్తుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

మటన్ లివర్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు, బలోపేతానికి ఉపయోగపడుతుంది. అయితే, ఇందులో కొలెస్ట్రాల్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు దీన్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి. ఎన్ని పోషకాలు ఉన్నా, మటన్ లివర్‌ను మితంగా తినడమే మంచిదని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు.

మద్యంతో మటన్ లివర్: ఏం జరుగుతుంది?

మద్యం సేవించినప్పుడు శరీరంలోని కాలేయం (లివర్) దాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మటన్ లివర్ తింటే, కాలేయంపై మరింత ఒత్తిడి పడుతుంది. మటన్ లివర్‌లోని అధిక కొలెస్ట్రాల్, కొవ్వులు మద్యంతో కలిసినప్పుడు జీర్ణ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తాయి. దీనివల్ల కొందరికి గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

వైద్యులు ఏం చెబుతున్నారు?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మద్యంతో పాటు మటన్ లివర్‌ను అధికంగా తినడం వల్ల కాలేయ సమస్యలు, కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటికే కాలేయ వ్యాధులు లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ఇలా తినడం పూర్తిగా మానుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, మితంగా మద్యం సేవించేవారు కూడా మటన్ లివర్‌ను తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది.