
రోజును ప్రారంభించేటప్పుడే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది గొప్ప మార్గం. రోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేస్తే ధైర్యం, ఓర్పు, స్థిరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
ప్రతిరోజూ ఉదయం ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడమే కాకుండా.. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీనివల్ల శరీరం ఉత్సాహంగా మారుతుంది.
నడక అనేది అత్యంత సరళమైన వ్యాయామం. ఉదయాన్నే పార్కులో లేదా ఇంటి చుట్టుపక్కల అరగంట నడవడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. ఈ అలవాటు శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
వీలైనంత వరకు బయట దొరికే తక్కువ పోషకాలున్న ఆహారాలను నివారించాలి. జంక్ ఫుడ్ లో కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండటంతో బరువు పెరగడం, షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఇంటి ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి.
నవ్వు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. స్నేహితులతో హాయిగా మాట్లాడటం, నవ్వుతూ గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు హాయిగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
పోషక విలువలు ఉన్న ఆహారం మాత్రమే శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, శనగలు, పప్పులు వంటివి ఆహారంలో భాగం చేయాలి.
మంచి నిద్ర వల్లే శరీరంలోని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. నిద్రలో శరీరం విశ్రాంతి పొంది, కొత్త శక్తి వస్తుంది. ఎక్కువ రోజులు నిద్రపోకపోతే మానసిక అలజడి, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి సరిగ్గా నిద్రపోవాలి.
సూర్యకాంతి ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ D లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రతి రోజు ఉదయపు ఎండలో 15 నిమిషాలు ఉంటే శరీరానికి తగినంత విటమిన్ D లభిస్తుంది.
ప్రకృతిలో గడిపిన ప్రతి క్షణం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెట్లు, మొక్కలు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. వాటితో గడిపిన సమయం మన శరీరాన్ని శుభ్రపరిచి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమయ్యే అనుభూతి కలుగుతుంది.
ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవితం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ఈ చిన్న ఆరోగ్య అలవాట్లను రోజూ పాటిస్తే.. మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇవి అలవాటయ్యాక మీరు ఒత్తిడిని తేలిగ్గా ఎదుర్కోగలుగుతారు.