
మన దేశంలో టీ అంటే కేవలం పానీయం కాదు, అదొక ఎమోషన్. కానీ ఇదే టీ ఇప్పుడు ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీని తయారు చేసిన 15 నుంచి 20 నిమిషాల లోపు తాగేయాలని, ఆ సమయం దాటిన టీని తాగడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతింటాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
పాము కాటు కంటే ప్రమాదమా?
నిల్వ ఉన్న టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. 24 గంటలు దాటిన టీ ‘పాము కాటు కంటే ప్రమాదకరం’ అని జపాన్ ప్రజలు భావిస్తారు. చైనాలో కూడా నిల్వ ఉన్న టీని విషంగా పరిగణిస్తారు. టీ చల్లారిన తర్వాత అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం.
పాలు కలిపిన టీతో జాగ్రత్త:
పాలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగి ఉంటాయి. పాలు కలిపిన టీని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. ఒకవేళ ఫ్రిజ్‌లో పెడితే ఒకటి నుంచి మూడు రోజులు నిల్వ ఉండవచ్చు కానీ, దాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అందులో పోషకాలు నశించి, అసిడిటీ పెరిగే అవకాశం ఉంది. తరచూ వేడి చేసిన టీ తాగడం వల్ల శరీరంలో ఇనుము శోషణ తగ్గిపోతుంది.
అల్లం టీ పరిస్థితి ఏమిటి?
పాలు లేని అల్లం టీ కొంతవరకు సురక్షితం. దీన్ని ఫ్రిజ్‌లో పెడితే మూడు నుంచి ఐదు రోజులు నిల్వ ఉంటుంది. అయితే తాగే ముందు బాగా మరిగించాలి. టీ రంగు మారినా లేదా వాసన వస్తున్నా వెంటనే పారబోయాలి. రోజుకు 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం వాడటం వల్ల గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదం ప్రకారం.. నిల్వ ఉన్న లేదా మళ్లీ వేడి చేసిన టీ శరీరంలో ‘విషం’ (Toxins) తయారు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మందగింపజేస్తుంది. టీని పదేపదే మరిగించడం వల్ల అందులోని ప్రోటీన్లు దెబ్బతిని, అసిడిటీ, మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. టీని ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని తాగడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.