మీకు కరోనా పాజిటివ్ వస్తే.? ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? తెలుసుకోండి!

|

Apr 25, 2021 | 11:16 AM

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

మీకు కరోనా పాజిటివ్ వస్తే.? ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? తెలుసుకోండి!
Follow us on

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారందరికి ట్రీట్ మెంట్ ఇవ్వడం అంత ఈజీగా కాదు. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వైర‌స్ సోకిన చాలా మంది హోమ్ ఐసోలేష‌న్ ఉండాల‌ని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే అస‌లు చాలా మందికి ఇంట్లో ఉండేట‌ప్పుడు ఏం చేయాలో స్పష్టమైన అవ‌గాహ‌న ఉండ‌టం లేదు. వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కగా వెలుతురు, గాలి వ‌చ్చే గ‌దిలో క‌రోనావైర‌స్ సోకిన‌వారిని ఉంచాలి. వారికి ఉప‌యోగించే మ‌రుగుదొడ్డిని వేరెవ‌రూ వాడ‌కూడ‌దు. రోగుల‌ను చూసుకోవ‌డానికి ఒక స‌హాయ‌కుడు వారికి ఎప్పుడూ అందుబాటు ఉండాలి. నీళ్లు ఎక్కువ‌గా తాగాలి. గోరు వెచ్చటి నీరు మంచిది. గ‌ది నుంచి బ‌య‌ట‌కు వస్తే మాస్క్ ధ‌రించ‌డం తప్పనిసరి. ద‌గ్గే ట‌ప్పుడు లేదా తుమ్మే ట‌ప్పుడు హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా టిష్యూ ఎప్పుడూ ఉప‌యోగించాలి. వాడిన క‌ర్చీఫ్‌, టిష్యూ, దుస్తులను గాలి చొర‌బ‌డ‌లేని క‌వ‌ర్లు, చెత్త బుట్టల్లో వేయాలి. వీలైతే ఇంటి బ‌య‌ట వీటిని కాల్చేయాలి. ఇత‌ర చెత్తతో వీటిని క‌ల‌ప‌కూడ‌దు. మ‌రుగుదొడ్డికి వెళ్లే ముందు, వెళ్లిన త‌ర్వాత చేతులను 40 నుంచి 60 సెకన్ల పాటు క‌డుక్కోవాలి. త‌డి చేతుల్ని తుడుచుకోవ‌డానికి క్లాత్ ఉప‌యోగించొద్దు. ఐసోలేష‌న్ గ‌దిని రోగులే శుభ్రం చేసుకోవాలి. ఇంటికి శుభ్రం చేసేందుకు బ్లీచింగ్ పౌడ‌ర్ లేదా డిస్ ఇన్ఫెక్టెంట్‌ల‌ను ఉప‌యోగించాలి. రోజుకు రెండు సార్లు గ‌దిని శుభ్రం చేయాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొగ తాగ‌కూడ‌దు. ఎందుకంటే వైర‌స్ శ్వాస‌కోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. వాడిన దుస్తులను 30 నిమిషాల‌పాటు వేడి నీళ్లలో పెట్టి త‌ర్వాత ఉత‌కాలి.

ఏం చేయకూడదు…

కరోనా తేలికపాటి లక్షణాలు ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్, రెమ్ డెసివిర్ తీసుకోవద్దు. ఆక్సిజన్ స్థాయి 94కు తగ్గినా, బ్రీతింగ్ సమస్య ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గూగుల్ లో వెతికి మందులు తీసుకోవద్దు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఇంట్లో చికిత్స వద్దు. వెంటనే హాస్పిటల్కు వెళ్ళండి. అలాగే మాస్కులను రీయూజ్ చేయొద్దు. ఇక మాస్క్ లేకుండా ఇంట్లో తిరగవద్దు.