Healthy brain: నోరు మంచిదైతే.. మెదడు ఆరోగ్యంగా ఉంటుందట! మెదడుకి, నోటికి లింకేంటబ్బా?

|

Feb 09, 2023 | 3:45 PM

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటుంటారు పెద్దలు.. అంటే మనం మాట్లాడే మాటలు మంచిగా ఉండాలనే అర్థంలో ఇది చెప్పారు. కానీ ఇక్కడ నోరు మంచిదైతే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అదేంటి నోటికి మెదడు ఆరోగ్యానికీ లింకు ఉందా?

Healthy brain: నోరు మంచిదైతే.. మెదడు ఆరోగ్యంగా ఉంటుందట! మెదడుకి, నోటికి లింకేంటబ్బా?
Healthy Brain
Follow us on

నోటి శుభ్రతకు మెదడు ఆరోగ్యానికి లింకు ఉందంటే నమ్ముతారా? నోటిని సక్రమంగా క్లీన్ చేసుకోకపోతే రక్తంలో క్లాట్ లు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? అవునండి మీ నోరు పరిశుభ్రంగా లేకపోతే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల చేసిన ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అసలు మెదడుకి, నోటి శుభ్రతకు లింకేంటి? ఆ అధ్యయనం చెప్పిందేంటి? లక్షణాలు ఎలా గుర్తించాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇదే అధ్యయనం..

నోటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం మెరుగైన మెద‌డు ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌ని అమెరిక‌న్ స్ట్రోక్ అసోసియేష‌న్ నిర్వ‌హించే ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట్రోక్ కాన్ఫ‌రెన్స్ 2023లో స‌మ‌ర్పించ‌నున్న అధ్య‌య‌నం వెల్ల‌డించింది. చిగుళ్ల వ్యాధి, నోటి ప‌రిశుభ్ర‌త స‌రిగ్గా లేక‌పోవ‌డానికి స్ట్రోక్ ముప్పు పెరిగేందుకు మ‌ధ్య సంబంధాన్ని ఇది సూచించింది. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఈ రెండింటి మ‌ధ్య సంబంధాన్ని ఇప్పుడు మ‌నం ప‌సిగ‌ట్ట‌వ‌చ్చ‌ని అధ్య‌య‌న ర‌చ‌యిత, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన‌ సిప్రిన్ రివిర్ తెలిపారు.

ఏం జరుగుతుందంటే..

మన నోటిలో చిగుళ్లపై ఒక గారలాంటిది ఏర్పడుతుంటుంది. దీన్నే సూప్రా జింజివల్‌ ప్లాక్‌ లేదా సబ్‌ జింజివల్‌ ప్లాక్‌ అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్‌లెట్‌లను గుంపులుగా చేరేలా చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్‌ ఫార్మేషన్‌’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబో ఎంబాలిజమ్‌’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీయవచ్చు. అంతేకాదు మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ల దగ్గరి ఇన్ఫెక్షన్‌ అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ అనే కండీషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం ముఖం శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడమన్నమాట.

ఇవి కూడా చదవండి

పరిశోధన ఎలా సాగిందంటే..

హృద్రోగం, స్ట్రోక్ త‌ర‌హాలోనే మెద‌డు ఆరోగ్యం కూడా జీవ‌న‌శైలి, అల‌వాట్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, దంతాలు, చిగుళ్ల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం మంచిద‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు. 2014, 2021 మ‌ధ్య 4000 మంది పెద్ద‌ల‌పై నోటి ప‌రిశుభ్ర‌త‌, మెద‌డు ఆరోగ్యం మధ్య సంబంధంపై ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేప‌ట్టారు. అధ్య‌య‌నంలో పాల్గొన్న వారికి ఎంఆర్ఐ ఇమేజ్‌ల ద్వారా మెద‌డు ఆరోగ్యాన్ని ఆరా తీశారు. దంత స‌మ‌స్య‌లు, చిగుళ్ల వ్యాధులు ఉన్న వారిలో మెద‌డుకు ర‌క్తస‌ర‌ఫ‌రాను నిరోధించే సైలెంట్ సెరిబ్రొవాస్క్యుల‌ర్ వ్యాధిని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ప్ర‌జ‌లు నోటి ప‌రిశుభ్ర‌త‌ను విధిగా పాటించాల‌ని, ప్రాణాంత‌క వ్యాధుల‌కు ఇది దారితీయ‌కుండా చూసుకోవాల‌ని ప‌రిశోధ‌కులు కోరుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..