Vaccine: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కొన్నింటికి వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అందుబాటులో ఉంటే మరి కొన్నింటికి లేవు. ఇక గత ఏడాదికిపైగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు ఎట్టకేలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. యుద్ధప్రతిపాదికన శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే మనిషిని అనారోగ్యానికి గురి చేసే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. కొన్ని వ్యాధులకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. ఇవేంటో చూద్దాం.
HIV AIDS వైరస్: హెచ్‌ఐవీ వైరస్ ప్రమాదకరమైనదే. దీనికి ఎలాంటి వ్యాక్సిన్ కానీ, పూర్తిగా తగ్గిపోయే మందులు కానీ అందుబాటులో లేవు. ఈ వ్యాధిని శాస్త్రవేత్తలు 3 దశాబ్దాల కిందట అంటే 30 సంవత్సరాల క్రితం గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. దాదాపు 32 మిలియన్ల మంది ఎయిడ్స్ (హెచ్‌ఐవీ) బారిన పడి మరణించారు. ఈ వ్యాధికి సంబంధించిన మెడిసిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి ఔషధం రాలేదు. ప్రస్తుతం ఎయిడ్స్ బారిన పడిన వారికి వైరస్ పెరగకుండా ఉండేందుకు మందులు ఇస్తున్నారు తప్ప.. పూర్తిగా నయం అయ్యే ఔషధాలు అందుబాటులో లేవు. ఈ వ్యాధిపై ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎలాంటి మార్గం లేదు. ఈ వ్యాధి లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తుంది.
ఏవియన్ ఇన్ ఫ్లూయంజా (బర్డ్ ఫ్లూ). ఈ వైరస్ మొదటిసారిగా 1997 లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇది మొట్టమొదటి సారిగా హాంకాంగ్‌లో నమోదైంది. H5N1 వైరస్ పక్షి మలం నుండి మానవులకు వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2013 మరియు 2017 మధ్య మొత్తం 1,565 అంటు అంటువ్యాధులు నమోదయ్యాయి. ఈ వ్యాధి సోకిన వారిలో 39 శాతం మంది మరణించారు. ఈ వైరస్ మానవుని నుండి మానవుడికి వ్యాపించడం అసాధారణమైనది. ఈ వైరస్ ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపాలోని 50కిపైగా దేశాలకు వ్యాపించింది.
సార్స్ కోవ్.. అనేది కరోనా వైరస్ లాంటిది. ఇది 2003 సంవత్సరంలో బయటపడింది. దీని మొదటి కేసు చైనాలో నమోదైంది. ఈ వ్యాధి గబ్బిలాల నుండి మానవులకు వ్యాపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాపించిన సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. 2003 లో 26 దేశాలలో 8000 మందికి పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. అలాగే వ్యాధి సంక్రమణ కారణంగా సుమారు 916 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం, దాని ఇన్ఫెక్షన్ కేసులు తక్కువగా నమోదయ్యాయి.