ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ రాజ్యమేలుతుంది. ఎక్కడెక్కడో జరిగిన వింతలు, విశేషాలు మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయంటే దానికి కారణం సెల్ ఫోన్. సెల్ ఫోన్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఇక పసి పిల్లలకు అయితే వ్యసనంగా మారుతోంది. ఫోన్ చూపిస్తేనే అన్నం తింటున్నారు. అయితే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 90 శాతం మంది సెల్ ఫోన్ చూస్తూ ఆహారం తింటున్నారని అధ్యయనంలో తేలింది. పిల్లలు కడుపు నిండా తింటున్నారని.. అనుకుంటున్నారని కానీ దీంతో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే విషయం మాత్రం ఆలోచించడం లేదు. ఇదే పద్దతి క్రమంగా పిల్లలపై మానసిక, శారీరక ఆరోగ్యం ప్రభావం చూపుతోంది.
కళ్లు బలహీనం అవుతాయి:
పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటే కళ్లు బలహీనంగా మారతాయి. దీంతో చిన్నప్పుడే వారు కళ్ల జోడు వేసుకోవాల్సి వస్తుంది. అంతే కాకుండా చిన్నప్పటి నుంచే స్క్రీనింగ్ ని దగ్గరి నుంచి చూడటం వల్ల రెటీనా దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి.
బాండింగ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి:
పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ అన్నం తినడం వల్ల తల్లీ, బిడ్డల సంబంధంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. వాళ్లు అన్నం తింటున్నప్పుడు తల్లిని చూడరు. దీంతో వీరి మధ్య బాండింగ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది.
ఆలస్యంగా జీర్ణం అవుతుంది:
ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల జీవ క్రియ రేటు అనేది తగ్గిపోతుంది. దీని వల్ల ఆహారం ఆలస్యంగా జీర్ణం అవుతుంది. దీంతో వారికి మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఆహారం రుచి తెలీదు:
మొబైల్ చూస్తూ తినడం వల్ల వారు ఏం తింటున్నారు? అనే దానిపై ధ్యాస ఉండదు. ఏదో ఒకటి తింటున్నాం అనుకుంటారు తప్ప.. వాళ్లు తినే ఆహారం రుచి తెలీదు. తిండి బాగుందో లేదో కూడా అర్థం కాదు. సెల్ ఫోన్ చూస్తూ ఒక్కొక్కరు ఆహారం ఎక్కువగా తినేస్తారు. మరికొందరు తక్కువగా తింటారు.
మెదడుపై ప్రభావం చూపిస్తుంది:
పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటే.. దాని బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. సెల్ ఫోన్ చూసే పిల్లలు ఎక్కువగా నలుగురిలో ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరు. ఇదే దీర్ఘకాలంలో ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.