వర్షాకాలం అంటేనే.. అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే కాలం. వర్షం పడుతుందని ఆనందపడే లోగానే అంటువ్యాధులు మేమున్నాం మరిచిపోయారా.. అన్నట్లుగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే చాలా వరకూ వైరల్ ఫీవర్లు వ్యాపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా.. వీధుల్లో మురుగు పేరుకుపోయి.. దోమల బెడద పెరిగిపోతుంది. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల విజృంభణ ఇప్పుడే మొదలవుతుంది. అంటువ్యాధులు, విషజ్వరాల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని హెల్త్ టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం.
-సాధ్యమైనంత వరకూ ఇంట్లో ఫిల్టర్ చేసి, కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలి. ఎక్కడపడితే అక్కడ మంచినీరే కదా అని తాగేయడం మంచిది కాదు. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినపుడు కూడా మంచినీటి బాటిల్ ను వెంటతీసుకెళ్లడం శ్రేయస్కరం.
-చేతులను తరచూ సబ్బు లేదా హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి. లేదా శానిటైజర్ ను వాడుతూ ఉండాలి. దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
-పూర్తిగా చల్లబడిన, చల్లారిపోయిన ఆహారం కంటే.. అప్పటికప్పుడు వండిన వేడివేడి ఆహారాన్ని తినాలి. పిల్లలకు కూడా వేడి వేడి ఆహారాన్ని వడ్డించాలి. వీలైనంత వరకూ స్ట్రీట్ ఫుడ్, ఐస్ క్రీమ్ లు వంటి చల్లటి పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలి.
-వర్షాకాలంలో వీలైనంత వరకూ పచ్చిగా ఉన్న కూరగాయలు వంటి వాటిని తినకపోవడం మేలు. ఎందుకంటే వాటిద్వారా బ్యాక్టీరియా త్వరగా, డైరెక్టుగా సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
-పండ్లను తినేముందు.. వాటిని గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇష్టం కదా అని ఆహారాన్ని అతిగా తినకూడదు. మితంగా ఆహారాన్ని తీసుకుంటే అది ఉదర సంబంధిత సమస్యలకు దారితీయకుండా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి