AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OCD అంటే ఏంటి..? ఎందుకు వస్తుంది..? వీరి జీవితం ఎలా ఉంటుంది..?

మీరు తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారా..? తలుపులు లాక్ చేశారా లేదా అని పదే పదే చెక్ చేసుకుంటూ ఉంటారా..? ఇలాంటి లక్షణాలను కేవలం సాధారణ అలవాట్లుగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి OCD సంకేతాలు కావచ్చు. సాధారణంగా ఎవరైనా చాలా శుభ్రంగా లేదా అత్యంత క్రమశిక్షణతో ఉంటే.. వారిని చూసి వీళ్లకు OCD ఉన్నట్లుంది అని చాలా మంది సరదాగా అంటుంటారు. అసలు OCD అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

OCD అంటే ఏంటి..? ఎందుకు వస్తుంది..? వీరి జీవితం ఎలా ఉంటుంది..?
Ocd
Prashanthi V
|

Updated on: Jun 25, 2025 | 4:37 PM

Share

OCD (Obsessive compulsive disorder) అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య. దీంతో బాధపడేవారు కొన్ని ఆలోచనలను ఆపుకోలేరు. ఆ ఆలోచనలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీసి.. వారిని కొన్ని పనులను పదే పదే చేసేలా చేస్తాయి. ఉదాహరణకు చేతులను పదే పదే కడగడం.. తలుపులు లాక్ చేశారా అని పదిసార్లు తనిఖీ చేసుకోవడం వంటివి.

ప్రపంచ ప్రఖ్యాత వైద్య సంస్థల ప్రకారం.. OCD ఉన్నవారు తరచుగా ధూళి, సూక్ష్మక్రిముల భయంతో జీవిస్తారు. వారు ఏ పని చేసినా అది పూర్తయిందని వారికి అనిపించదు. మెదడు అదే పనిని మళ్లీ చేయమని ప్రేరేపిస్తుంది. ఇది మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనం సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది.

OCD లక్షణాలు

  • ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరికీ వస్తుంది. OCD లక్షణాలు వ్యక్తులను బట్టి వేర్వేరుగా కనిపించవచ్చు.
  • శుభ్రతపై అధిక ఆందోళన.. దుమ్ము, పురుగులతో మురికి అవుతుందని భయం.
  • అనవసర భయం.. తనే తప్పు చేస్తానేమో.. లేదా ఇతరులకు హాని చేస్తానేమో అన్న భయం.
  • అదుపులో లేని ఆలోచనలు.. ముఖ్యంగా ప్రమాదం, మరణం వంటి విషయాలపై నియంత్రణ లేని ఆలోచనలు.
  • ప్రమాద భయం.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం.
  • బయటకు వెళ్లడానికి భయం.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా భయంతో ఆగిపోవడం.

OCD ఉన్నవారు ఏం చేయాలి..?

  • సమయానికి గుర్తించగలిగితే OCDని సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. కొంతవరకు వ్యక్తిగతంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు.
  • ఆలోచనలు రాయడం.. మన మెదడులో వచ్చే ప్రతి ఆందోళనను డైరీలో రాసుకోవడం వల్ల స్పష్టత వస్తుంది. దీని వల్ల ఆ ఆలోచనలు మనపై ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటాయి.
  • నిజం అర్థం చేసుకోవడం.. మనకు వస్తున్న భావాలపై అవగాహన పెంచుకోవాలి. తప్పుడు భయాలను వాస్తవాల ఆధారంగా సరిచూసుకోవాలి.
  • సానుకూల ఆలోచనలు.. నేను బాగోలేను అనే భావనకు బదులుగా ఇది నాకు తాత్కాలిక సమస్య అని ఆలోచించడం అవసరం.
  • ఆత్మీయుల సహాయం.. మనకు దగ్గరగా ఉన్నవారితో మాట్లాడటం.. వారి మద్దతు పొందడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

చికిత్స ఎలా ఉంటుంది..?

OCD చికిత్సలో ప్రధానంగా ప్రవర్తనా వైద్య పద్ధతి (CBT), మానసిక కౌన్సిలింగ్ వంటివి వాడతారు. అవసరమైతే తగిన మోతాదులో మందులు కూడా ఇస్తారు. ముఖ్యంగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి.

OCD అనేది సాధారణ అలవాటు కాదు. ఇది గమనించాల్సిన, చికిత్స పొందాల్సిన మానసిక ఆరోగ్య సమస్య. శరీరానికి జ్వరం వచ్చినట్లు మనసుకు కూడా చికిత్స అవసరం అవుతుంది. మీరు లేదా మీకు తెలిసినవారు ఈ రకమైన లక్షణాలతో బాధపడితే.. ఆలస్యం చేయకుండా నిపుణుడిని కలవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)