
ప్రస్తుత రోజుల్లో నిపుణులు ఎక్కువగా ఏం చెబుతున్నారో తెలుసా..? 2 నుండి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో ఆటిజం లాంటి ప్రవర్తనలు పెరుగుతున్నాయి. దీనికి కారణం జన్యు సమస్య కాదు.. వాళ్ళు ఎక్కువగా స్క్రీన్లు (మొబైల్, టీవీ, కంప్యూటర్) చూడటమే. ఈ పరిస్థితిని వర్చువల్ ఆటిజం అని పిలుస్తున్నారు.
పిల్లలు బయటి ప్రపంచంతో కాకుండా డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడిపినప్పుడు.. వారి సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతాయి. స్క్రీన్ సమయం తగ్గిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ఒక పరిశోధన ప్రకారం.. 5 ఏళ్ల లోపు పిల్లల్లో 73 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన రోజుకు ఒక గంట స్క్రీన్ పరిమితిని దాటుతున్నారు. దీని వల్ల వారి ఎదుగుదల ఆలస్యమయ్యే అవకాశం 53 శాతం పెరుగుతుంది.
మన దేశంలో 11 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)తో బాధపడుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది పిల్లల్లో ఆటిజం లక్షణాలు 3 శాతం పెరిగాయి.
చిన్న వయసు నుంచే ఫోన్‌లు, టీవీలు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యే ఈ వర్చువల్ ఆటిజం. పిల్లలు ఇతరులతో మాట్లాడటం, ఆడుకోవడం తగ్గించి, డిజిటల్ పరికరాల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల వారి మాట్లాడే తీరు, సామాజిక నైపుణ్యాలు, ఏకాగ్రత దెబ్బతింటాయి. స్క్రీన్ సమయం తగ్గించి నిజ జీవితంలో ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తే ఈ సమస్యలో మంచి మార్పు వస్తుంది.
వర్చువల్ ఆటిజం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ వాటికి కారణాలు వేర్వేరు.
వర్చువల్ ఆటిజం అనేది మన కాలంలో పిల్లల ఎదుగుదలకు ఎదురయ్యే ఒక ముఖ్యమైన సమస్య. తల్లిదండ్రులుగా మనం దీని గురించి తెలుసుకోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కేవలం స్క్రీన్ సమయం తగ్గించడం మాత్రమే కాదు.. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, బయట ఆటలలో పాల్గొనేలా ప్రోత్సహించడం, కథలు చెప్పడం వంటివి అలవాటు చేయాలి. నిజ జీవితంలో వారు నేర్చుకునే నైపుణ్యాలే వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)