
చాలా మంది దిండ్లు పాతబడినా అలాగే వాడుతూ ఉంటారు. కానీ ఇవి నెమ్మదిగా మీకు సమస్యలు తెచ్చిపెడుతాయి. ఎందుకంటే దిండ్లలో కాలక్రమేణా ధూళి, చెమట, చర్మం నుంచి వచ్చే సూక్ష్మమైన పొడి లాంటివి చేరిపోతాయి. ఇవి అలర్జీలు, చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులకు కారణమవుతాయి. అంతేకాకుండా మంచి నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ప్రతి 1.5 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త దిండు తీసుకోవడం మంచిది. అలాగే దిండు కవర్లను వారానికి ఒకసారి శుభ్రం చేయడం అవసరం.
చాలా మందికి గదిలో మంచి వాసన రావాలని ఎయిర్ ఫ్రెషనర్లను ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఈ వాసన ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ ఎయిర్ ఫ్రెషనర్లలో ఫ్తాలేట్స్ (phthalates), బెంజీన్ (benzene) లాంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి శ్వాస సమస్యలు, హార్మోన్ల గందరగోళాలు, కొన్నిసార్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థపైనా చెడు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో ఇవి ఎక్కువ ప్రమాదం. సహజంగా మంచి వాసన ఇవ్వగల లెవెండర్, లెమన్ లేదా పుదీనా ఎసెన్షియల్ ఆయిల్స్ ను డిఫ్యూజర్ లో వాడటం మంచి ఎంపిక. అలాగే రోజూ గది కిటికీలు తలుపులు తెరిచి ఉంచితే గాలి మారడం వల్ల గదిలో స్వచ్ఛత పెరుగుతుంది.
పరుపులు ఎక్కువ కాలం వాడినప్పుడు అవి తేమ, ధూళి, సూక్ష్మజీవులు లాంటి వాటితో నిండి ఉంటాయి. దీని వల్ల అలర్జీలు, దద్దుర్లు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పరుపులు శరీరాన్ని సరైన స్థితిలో ఉంచలేకపోవడం వల్ల నిద్ర సమయంలో నడుము, మెడ నొప్పులు రావచ్చు. నెమ్మదిగా నిద్ర నాణ్యత తగ్గుతుంది. వైద్యులు చెప్పిన ప్రకారం.. పరుపులను 7 నుంచి 10 సంవత్సరాల మధ్య తప్పనిసరిగా మార్చాలి. అలాగే ప్రతి 6 నెలలకు వాటిని తిప్పడం.. తడి ఆవిరి లాంటివి తగలకుండా చూసుకోవడం కూడా ముఖ్యం.
మన శరీరానికి మంచి నిద్ర చాలా అవసరం. కానీ మనం పట్టించుకోని ఈ చిన్న చిన్న విషయాలు మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా పాడు చేస్తుంటాయి. పడకగదిలో ఉన్న వస్తువులను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు. ముఖ్యంగా పాతబడ్డ వస్తువులు, రసాయనాలు ఉన్న సువాసనలు వాడకుండా ఉండటం, గాలి బాగా వచ్చేలా చూసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.