
అనుకోకుకండా దెబ్బ తగిలినప్పుడు లేదా గతంలో జరిగిన గాయాల తాలూకు నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు వేడి లేదా చల్లటి పదార్థాలతో చికిత్స చేసే ముందు గాయం ఎలాంటిది, ఆ నొప్పి ఎంతకాలంగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏమాత్రం అవగాహన లేకుండా తప్పుడు కాపడం పెట్టడం వల్ల కండరాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి గాయం స్వభావాన్ని బట్టి చికిత్సను ఎంచుకోవాలి.
కొత్త గాయాలకు ఐస్ ప్యాక్…
కొత్తగా అయిన గాయానికి లేదా ఇటీవల దెబ్బ తగిలిన చోట మొదటి 24 నుండి 48 గంటల వరకు ఐస్ ప్యాక్ పెట్టడం చాలా మంచిది. ఐస్ లేదా చల్లటి కాపడాలు వాపును తగ్గించడమే కాకుండా, రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి నొప్పిని అదుపులోకి తెస్తాయి. గాయాలు, బెణుకులు లేదా ఆకస్మికంగా వచ్చే వాపు వంటి సమస్యలకు ఈ కోల్డ్ థెరపీ ఎంతో బాగా పనిచేస్తుంది.
అయితే, ఐస్ ముక్కలను నేరుగా చర్మంపై పెట్టకూడదు. దానిని ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి, గాయం అయిన చోట కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు మాత్రమే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టం కలగకుండా నొప్పి, వాపు రెండు సులభంగా తగ్గుతాయి.
పాత నొప్పులకు వేడి కాపడం…
చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న కండరాల నొప్పి, కీళ్ల బిగుతు, మెడ నొప్పి లేదా నడుము నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలకు వేడి కాపడం పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేడి వల్ల ఆయా భాగాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది , కండరాలు తేలికవుతాయి. దీనివల్ల నొప్పి తగ్గడమే కాకుండా, శరీరంలోని ఒత్తిడి కూడా క్రమంగా తగ్గుతుంది. 10 నుండి 15 నిమిషాల పాటు వేడి నీటి బ్యాగ్ లేదా హీటింగ్ ప్యాడ్‌ను ఉపయోగించడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
గాయం అయిన వెంటనే వేడి కాపడం పెట్టడం ప్రమాదకరం!
దెబ్బ తగిలిన వెంటనే వేడి కాపడం పెట్టడం చాలా ప్రమాదకరం. ఆ సమయంలో వేడి అనేది రక్త ప్రసరణను మరింత పెంచుతుంది. దీనివల్ల వాపు, నొప్పి తగ్గడానికి బదులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కాలంగా వాపు ఉన్న ప్రదేశానికి కూడా వేడి కాపడం పెట్టడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అందువల్ల, గాయం త్వరగా నయం కావడానికి సరైన సమయంలో సరైన పద్ధతిని ఉపయోగించడం చాలా అవసరం. దీని గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, సొంత నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఎంతో సురక్షితం.