Pregnancy: గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. ఈ సమయంలో స్త్రీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. తల్లి శరీరంలో పెరిగిన గ్లూకోజ్ బొడ్డు తాడు గుండా శిశువు రక్తంలోకి చేరుకుంటుంది. దీని కారణంగా పిల్లల రక్తంలో చక్కెర పెరుగుతుంది. దీని కారణంగా శిశువులో శారీరక లేదా మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. గర్భధారణ మధుమేహం అనేది తాత్కాలిక సమస్య అయినప్పటికీ దీని కారణంగా, భవిష్యత్తులో మహిళలు టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గర్భధారణ మధుమేహం లక్షణాలు, కారణాలు, ఇతర విషయాల గురించి తెలుసుకుందాం.
గర్భధారణ మధుమేహం లక్షణాలు
అలసట, అధిక దాహం, బరువు పెరగడం, గురక, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సాధారణంగా గర్భధారణ మధుమేహం లక్షణాలుగా చెప్పవచ్చు. వీటి ఆధారంగా నిపుణులు మధుమేహాన్ని తనిఖీ చేస్తారు. గర్భిణులు ఇలాంటి లక్షణాలని గమనించినట్లయితే వెంటనే నిపుణుడిని సంప్రదించడం మంచిది.
ఏ స్త్రీలకు గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.?
ఇది గర్భధారణ సమయంలో ఏ స్త్రీకైనా సంభవించవచ్చు. కానీ తరచుగా BP ఎక్కువగా ఉన్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారు, కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారు, పెద్ద వయస్సు స్త్రీలు గర్భధారణ మధుమేహానికి ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉంటాయి.
గర్భధారణ మధుమేహం శిశువుకు ఎలా హాని చేస్తుంది..?
గర్భధారణ మధుమేహం ఉన్నప్పుడు కడుపులోని శిశువు శరీరంలో అదనపు చక్కెరను కొవ్వుగా మారుతుంది. కాబట్టి శిశువు పరిమాణం సాధారణం కంటే పెద్దగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల డెలివరీ సమయంలో మహిళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అకాల డెలివరీ, కామెర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు గర్భధారణ మధుమేహం విషయంలో పిల్లలలో సెరిబ్రల్ పాల్సీ, నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం, స్పైనా బైఫిడియా, గౌట్, మూత్రాశయం లేదా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో చక్కెర స్థాయి ఎలా ఉండాలి..?
అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారం గర్భిణీగా ఉన్నప్పుడు చక్కెర స్థాయి గరిష్టంగా 95 mg/dL ఉండాలి. అదే సమయంలో భోజనం చేసిన ఒక గంట తర్వాత గరిష్టంగా 140 mg / dL ఉండాలి. రెండు గంటల తర్వాత గరిష్టంగా 120 mg / dL వరకు ఉండాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి