Adulterated Food: సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.? అంతా డేంజర్

కడివెడు పాలల్లో చిటికెడు కల్తీ. కలిగే నష్టం మాత్రం అపారం. రాజమండ్రి కల్తీ పాల ఘటన మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. 14 మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. శీతలీకరణ యంత్రానికి రిపేర్లు చేస్తుంటే, ఇథలీన్ గ్లైకాల్ అనే కూలెంట్ లీకై పాలక్యాన్‌లో కలిసిందని..

Adulterated Food: సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.? అంతా డేంజర్
Adulterated Food

Updated on: Feb 26, 2026 | 10:00 PM

రాజమండ్రి రోజ్‌మిల్క్.. గుబ్బా సింహాచలం గారి తిరుగులేని బ్రాండు. రుచి ప్రత్యేకం, నాణ్యత ప్రత్యేకం. 75 ఏళ్లనుంచి ఇది చాలా ఫేమస్సు. పేరు వినగానే నోరూరి, ఒళ్లు తిమ్మిరెక్కి, ఔట్‌లెట్ ఎక్కడున్నా వెతుక్కునివెళ్లి మరీ ఓ గ్లాసుడు లోపలికి తోస్తే తప్ప నిద్రపట్టనివాళ్లు మనచుట్టూ చాలామందే ఉంటారు. రాజమండ్రి మెయిన్‌రోడ్డు దాటి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మహానగరాలక్కూడా పాకిపోయింది రాజమండ్రి రోజ్‌మిల్క్ ప్రాభవం. కానీ, ఇవాళారేపూ రోజ్‌మిల్క్ మాట దేముడెరుగు, రాజమండ్రి మిల్క్ అంటేనే బెదిరిపోతున్నారు జనం. టోటల్ కల్తీ వ్యాపారాలకే తలమానికంగా ట్రెండవుతోందిప్పుడు. ఆరు నిండు ప్రాణాల్ని గాల్లో కలిపేసిన రాజమండ్రి పాల కల్తీ వ్యవహారం… రెండు రాష్ట్రాల్నీ కుదిపేస్తోంది. అరె.. తాగే పాలల్లో కూడా కల్తీ ఏంట్రా అని నోరెళ్లబెట్టేలోపలే.. నాటోన్లీ పాలు.. నీళ్లు, నెయ్యి, టీపొడి.. దేన్ని ముట్టుకున్నా మసే అనే క్లారిటీలొచ్చేస్తున్నాయి.

కడివెడు పాలల్లో చిటికెడు కల్తీ. కలిగే నష్టం మాత్రం అపారం. రాజమండ్రి కల్తీ పాల ఘటన మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. 14 మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. శీతలీకరణ యంత్రానికి రిపేర్లు చేస్తుంటే, ఇథలీన్ గ్లైకాల్ అనే కూలెంట్ లీకై పాలక్యాన్‌లో కలిసిందని, అదే కారణం అయ్యుండొచ్చని ప్రాధమికంగా తేలింది. కానీ, అసలు కారణం కోసం అధికారులు ఇప్పటికీ కుస్తీ పడుతున్నారు. తెలిసి కలిపినా, తెలీకుండా కలిసినా విషం విషమేగా..? పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా.. అందుకే, నిర్లక్ష్యంతోనో పైసల మీద పేరాశతోనో పాలను విషంగా మార్చి అమ్ముకుంటున్న ప్రైవేట్ డెయిరీ ఫామ్‌లపై భూతద్దం పెట్టింది ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన కదిలింది అధికారయంత్రాంగం. పాల కేంద్రాలపై నిఘా పెంచి ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించే వ్యవస్థపై వర్కవుట్స్ జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాల కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అమ్మకందారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే కల్తీగాళ్ల కరాళనృత్యాలు ఒక్కటొక్కటిగా బైటికొచ్చి కంపు కొడుతున్నాయి. బందరు, బెజవాడ, విశాఖ, కాకినాడ, అనంతపురం.. అటు, హైదరాబాద్, పాలమూరు, నిజామాబాదు.. వయా రాజమండ్రి.. ఆగేదే లేదంటూ చెలరేగిపోతోంది కల్తీ కా నామ్ గాడీ. అందుగలదిందు లేదని ఎందెందు వెతికిన అందందే దాపురిస్తోంది కల్తీగాళ్ల చేతివాటం.

బయట హోటళ్లలో వండే ఆహారం తింటే ఆరోగ్యాలు ప్రమాదంలో పడతాయని, శుచీశుభ్రత కలిపి మనమే వండుకుందామని ఇంటి వంటకే ప్రయారిటీలిద్దామంటే.. అక్కడ కూడా దాపురించారు కల్తీగాళ్లు. వంటకు వాడే ప్రతీ వస్తువూ కల్తీ అయ్యాకే మన కిచెన్‌లోకి చేరుకోంది. ఉప్పు పప్పూ శనగనూనె దాకా దేన్నీ నమ్మే పరిస్థితుల్లేవు. మంచిమంచి ప్యాకేజీల్లో అమ్ముడయ్యే బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్‌ని కూడా అనుమానపు కళ్లతో చూడాల్సిన పరిస్థితి. ఏది ఒరిజినల్.. ఏది వల్గర్.. తెలుసుకునేదెలా?

కొబ్బరిపీచుకి బెల్లంపాకం కలిపి మూడు రోజులు ఎండలో ఆరబెడితే టీపొడి తయారౌతుందని మీకు తెలుసా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి కోసం ఏ భోలేబాబా డెయిరీకో వెళ్లాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? ఉప్పు, చక్కెర కలిపిన ఒక లిక్విడ్‌ యాడ్ చేస్తే పాలల్లో తెల్లదనం పెరుగుతుందని ఎవరొచ్చి ఎవరికి చెబుతారు? రేబిస్ సోకిన గేదెపాలు తాగితే ఆ రేబిస్ మనకూ వస్తుందన్న మిలియన్ డాలర్ల డౌట్లను ఎవరొచ్చి పటాపంచలు చేస్తారు? మన తాగే తేనెలో దగ్గు సిరప్ కలిసిందంటే నమ్ముతారా? నమ్మాలి. నమ్మి తీరాలి. పాలు… ప్రతీ ఇంటికీ నిత్యావసరం. పైగా, ఆరోగ్యానికి అత్యవసరమని డాక్టర్లు చెబుతారు. కానీ, ఆ పాలలోనే పాపాలు కలిస్తే..! పాకెట్ పాల మీద అనుమానాలొచ్చి లోకల్‌ పాలు పోయించుకుంటే..! అది కూడా సేఫ్ కాదని రాజమండ్రి మిల్క్ షేక్ ఉదంతం తేల్చేసిందిగా?

ముఖ్యంగా లైసెన్స్‌ లేని రోడ్‌సైడ్‌ పాల కేంద్రాలపై నిఘా పెరిగింది. అనంతపురంలోని కొన్ని పాల కేంద్రాల్లో తనిఖీలు చేసిన అధికారులకు మైండ్ బ్లాకైపోయింది. అక్కడమ్మే పాలల్లో మాల్టోడెక్స్‌ట్రిన్ పౌడర్‌ కలుపుతున్నారు. మరికొన్నిచోట్ల సాల్ట్, షుగర్‌ కలిపి కల్తీపాలు తయారౌతున్నాయి. వీటిని మళ్లీ అమ్మకానికి పెట్టకుండా క్యాన్లలో ఫినాయిల్‌ కలిపి సీజ్ చేయాల్సిన పరిస్థితి. చిక్కటి చాయ్ పెట్టడానికి కమ్మటి టీపొడి కావాలంటే తేయాకు తోటల్లోకే వెళ్లాల్సిన పన్లేదు. ఇదిగో హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో ఓ రేకుల షెడ్డు కింద గుట్టుచప్పుడు కాకుండా తయారైపోతుంది. కొబ్బరిపీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్.. ఈ మూడూ కలిపి.. ఎంచక్కా చాయ్‌పత్తీ తయారు చేస్తున్నాడీ మాయగాడు. పేరు జగన్నాథ్ బిష్ణోయ్. మార్కెట్లో దొరికే టీడస్ట్ కొద్దిగా కలిపితే చాలు అసలైన చాయ్‌పత్తీలా తళతళా మెరుస్తుంది. కోణార్క్‌ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ అయ్యే టీపొడి కిలో జస్ట్ 160 రూపాయలే. చౌకగా దొరుకుతోంది కదా అని టీస్టాల్స్ వాళ్లు దీన్నే కొనుక్కుని గరంగరం చాయ్ చేసి మన చేతుల్లో పెడతారు. కానీ, టీపౌడర్ చాలా డేంజరస్ అని, ఆరోగ్యాలు ఖల్లాస్ ఔతాయని, లివర్, కిడ్నీ చెడిపోతుందని ఎంతమందికి ఎరుక?

ఇదిగో… అమ్మచేతి కమ్మదనానికి ఒరిజినల్ పేటెంట్ మాదే అన్నంత బిల్డప్పులిచ్చిన ఈ నేతి వ్యాపారులు అడ్డంగా దొరికిపోయారు. రాముగారి నెయ్యి.. రుచికరంగా ఉండు.. కానీ, పొట్ట విప్పి చూడ పురుగులుండు..! పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలు, పాలపదార్ధాలు అమ్మే షాపులు కక్కూసుల కంటే దారుణం. పాలు, నెయ్యి, వెన్న దేన్ని పట్టుకున్నా వెగటుపుట్టించే వాసన. మరి, దీన్ని కొనుక్కుని తిన్నవాళ్ల పరిస్థితి ఏంటో? తెల్లటి పూసపూసగా జాలువారాల్సిన నెయ్యి ఇలా నల్లరంగులో కనిపిస్తుందేంటి? వెన్నలా ఉంది కానీ, ఇదసలు వెన్నేనా? లేక జంతువుల కొవ్వా? పదివేలు కాదు 20 లక్షలిచ్చినా నిన్నొదల.. సీజ్ ద షాప్ అంటున్నారు అధికారులు. సీఎం గారు వాయించేస్తున్నారంటే వాయించెయ్యొరా ఏంది? అవతల ప్రాణాలు దూదిపింజల్లా రాలిపోతుంటే! అటు, తెలంగాణలో కూడా పాలకూట విషం పాకెట్లు కట్టుకుని ఇంటి గుమ్మం దగ్గరికే చేరుతోంది. హైదరాబాదీలు పరేషానయ్యే షాకింగ్‌ న్యూస్‌ ఇది. కడ్తాల్‌ మండలం రాయ్‌చేడ్‌ నుంచి భాగ్యానగరానికి కల్తీ పాలు యధేచ్ఛగా సరఫరా ఔతున్నట్టు తేల్చారు రంగారెడ్డి జిల్లా పోలీసులు. ఉప్పు, చక్కెర కలిపి ఒక లిక్విడ్‌ తయారుచేసి, దాన్ని పాలల్లో కలిపి అమ్మేస్తున్నారు. ఇలా చేస్తే పాలకు మరింత తెల్లదనం కలిసి తళతళా మెరుస్తాయట. ఈ దందా ఎన్నాళ్లుగా జరుగుతోందో మరి. ఇన్ని కల్తీ మాయలు చూశాక.. బతుకుతీపి కొద్దికొద్దిగా తగ్గిపోతోంది జనానికి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో జనమైతే కల్తీ వార్తలు వినీవినీ దాదాపు చచ్చేపోయారనుకోండి…!

వేంపేటలో అసలేం జరిగింది..? రేబిస్ వ్యాధి లక్షణాలతో ఇటీవల ఓ గేదె చనిపోయింది. జనాల్లో భయం మొదలైంది. ఎందుకంటే, ఆ గేదె పాలనే యజమాని పాలకేంద్రంలో విక్రయిస్తాడు. వాటినే వీళ్లు కొనుక్కుని తాగుతారు కనుక. వారం రోజులుగా ఆ గేదె అనారోగ్యంతో గడ్డి తినకుండా ఇబ్బంది పడటంతో పరీక్షించిన వైద్యులు రేబిస్‌ సోకినట్టు గుర్తించారు. రెండు రోజుల కిందట ఆ గేదె చనిపోవడంతో, తమక్కూడా రేబిస్‌ వస్తుందనే భయంతో… ఆరోగ్య కేంద్రం దగ్గరికి క్యూ కట్టారు వేంపేట జనం. యాంటీ రేబీస్‌ ఇంజెక్షన్ల కోసం ఎగబడ్డారు. ఇప్పటివరకూ 30మంది వ్యాక్సిన్ వేయించుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. రేబిస్‌ సోకిన గేదెపాలు తాగితే రేబిస్ రాదని, పుకార్లు నమ్మొద్దని ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు జనం. ఎందుకంటే, రాజమండ్రి కల్తీ పాల ట్రాజెడీ కూడా తెలిసి జరిగింది కాదు, పొరపాటున కూలెంట్ పాలల్లో కలిసి విషంగా మారింది. సో, సరైన నిఘా లేని ప్రైవేట్ పాల వ్యాపారాలు ఎప్పటికైనా డేంజరే అన్నమాట.

కల్తీగాళ్ల కళాపోషణ రోజురోజుకీ మితిమీరిపోతోంది. కేవలం వారం రోజుల గ్యాప్‌లో మొత్తం 42 రకాల కల్తీ పదార్ధాల్ని సీజ్ చేశారు రాచకొండ SOT పోలీసులు. ఇది ఆల్‌టైమ్ రికార్డ్. మాకు దొరికినవైతే ఇవి.. దొరకని కల్తీ పదార్థాలు మార్కెట్లో కోకొల్లలు. వాటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మా చట్టాలు ఏమీ చేయలేవు… అని చేతులెత్తేస్తున్నారు పోలీసులు. సో, సగటు తెలుగోడి మేజర్ పరేషాన్ ఏంటంటే.. కల్తీ రహిత ఆహారాన్ని నిర్మూలించుకోవడం. అది సాధ్యమయ్యే పనేనా? ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎవ్వర్నయినా ఉపేక్షించేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మాటలే కాదు, చేతలు కూడా షురూ అయ్యాయి. స్టేట్‌వైడ్ రెయిడ్స్‌తో ప్రైవేట్ పాల కేంద్రాలన్నిటికీ తడారిపోతోంది. ప్యాకేజ్డ్‌ మిల్క్ ఐతే ఏ బెడదా లేదు. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం డీటెయిల్స్ అన్నీ ప్రింటై ఉంటాయి. ఎందుకంటే, కల్తీ మరకలు పడితే వాళ్ల బ్రాండ్‌వ్యాల్యూలు ఎక్కడ పడిపోతాయో అనే భయం వాళ్లకు. ఏతావాతా లూజ్ పాల విషయంలోనే కూసింత అప్రమత్తత అవసరం. మనింటికొచ్చే పాలు ఒరిజినలా కాదా తెలియాలంటే చిన్నచిన్న పరీక్షలు చేస్తే సరి.

స్వచ్ఛమైన పాలు కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడ చిక్కగా తేరుకుంటుంది. కల్తీ పాలు వేడిచేస్తే మీగడ ఆనవాళ్లే ఉండవు. నీళ్లు కలిపిన పాలైతే పెద్ద సమస్యేమీ కాదు. కల్తీ కలిస్తే మాత్రం చిక్కులే. ప్రతీరోజూ కాకపోయినా అప్పుడప్పుడూ ఐనా ఇలా పరీక్షించుకుంటే దాదాపుగా సేఫ్. తాగే పాలు సరే, తినే తిండి సంగతేంటి? బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇష్టంగా లాగించేవాళ్లను ఠారెత్తించిన ఓ న్యూస్ ఇటీవలే బ్రేకైంది. ఏంటంటే, చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ పాయింట్స్‌తో ఎక్కువగా వాడేది స్వచ్ఛమైన నూనె కాదు, జంతు కొవ్వుతో తయారయ్యే మాయదారి కల్తీ నూనె. మాంసం కోసం చంపిన జంతువుల వ్యర్థాలతో ఒక రకమైన ఆయిల్‌, జంతు కొవ్వు, ఎముకలతో ఇంకోరకమైన ఆయిల్ తయారౌతోంది. పల్లెల్లో, పట్టణాల్లో బయట చిన్నాచితకా హోటళ్లలో తయారయ్యే తిండిలో వాడుతున్నది ఆ చెత్త నూనేనట. వేడివేడిగా తింటాం గనుక మనకు ఆ తేడా తెలీదంతే. సంపాదనే తప్ప సామాన్యుల ఆరోగ్యం పట్టని దుర్మార్గులు గోదావరి-గుంటూరు-హైదరాబాద్‌లో జంతు కొవ్వు నూనె దందాను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా విజిలెన్స్‌ తనిఖీల్లో తేలిన సంచలనం ఏంటంటే, బ్రాండెడ్‌ కంపెనీల లేబుల్స్‌ అతికించిమరీ వీటిని మార్కెటింగ్‌ చేయడం. మంగళగిరిలో కూడా రహస్యంగా నడుస్తున్న ఆయిల్‌ దందాను వెలుగులోకి తీసుకొచ్చింది టీవీ9.

ఇలా తయారయ్యే నూనెలు లూజ్‌లో షాపుల్లో కూడా అమ్ముతారు. గల్లీ దుకాణాల్లో పేద కుటుంబాలు కొనుక్కుని, తమ వంటల్లో వాడుకునేది ఎక్కువ భాగం ఈ జంతుకొవ్వు నూనెలేగా? హోటల్ ఫుడ్డు మీద భయాలతో ఇంటి ఫుడ్డు మీద ఆధారపడదామంటే… అక్కడ కూడా ప్రాణాంతకమైన వంటనూనెలు కొంప ముంచుతున్నట్టేగా? వెజిటేరియన్లు ప్రాణప్రదంగా భావించి ఇష్టంగా తినే మోస్ట్ వాంటెడ్ పదార్థం… పన్నీర్.. శాకాహార వంటల్లో పన్నీర్‌కే అగ్రతాంబూలం. క్లీన్ అండ్ ప్యూర్ పన్నీర్ కొనాలంటే కిలో రెండువేలు పెడితే గాని దొరకదు. కానీ… కొన్నిచోట్ల కేవలం ఐదారువందల రూపాయలకే కిలో పన్నీర్ దొరికేస్తోంది. ఇదెలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? ఇదిగో, ఇక్కడ పనీర్ తయారే విధానాన్ని చూస్తే… ఇంకోసారి పనీర్ తినాలని ఎవ్వరూ అనుకోరు. ఇవి తింటే క్యాన్సర్లను డబ్బులిచ్చి కొనితెచ్చుకున్నట్టే. హోటల్లో బిరియానీ గాని, సైడ్ డిష్‌ గానీ చూడగానే తినాలనిపించేలా వాటిపై కలర్‌ఫుల్ ఇన్‌గ్రేడియంట్స్ వాడతారు. కానీ, ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పన్లేదంటారు. కానీ, ఆ తినే ఒక్క యాపిల్‌ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ధగధగ మెరవడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి యాపిల్ పండుపై మైనపు పూత పూస్తారు. మార్ఫిన్ అనే ఈ కెమికల్‌తో లివర్, కిడ్నీలు పాడైపోతాయ్. యూరియా, డిటర్జెంట్, కాస్టిక్ సోడా కలిపి పాలను ఎలా కల్తీ చేస్తారో.. బ్లెండెడ్ ఆయిల్స్‌తో వంటనూనెల్నీ చేస్తారు. పుచ్చిపోయిన పాత పప్పులు మెరిసేలా చేయడానికి టాల్కం పౌడర్ కలుపుతారు. కారప్పొడిలో రంపం పొట్టు కలపడమే కాదు, పసుపు, ఉప్పు, బియ్యం, గోధుమ పిండి అన్నిటా కల్తీనే. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే… కాఫ్ సిరప్, చక్కెర కలిపిన సొల్యూషన్‌తో కల్తీ తేనె తయారౌతోంది.

కల్తీ కేటుగాళ్లను పట్టుకుని కాగితాలెక్కడ్రా అని అడిగితే.. దీనిక్కూడా పర్మిషన్ తీసుకోవాలా సార్ అని అమాయకంగా అడుగుతున్నారట. సో… ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలన్న కనీస జ్ఞానం కూడా వీళ్లకు లేదు. రెండుమూడుసార్లు పట్టుబడ్డా చిన్నసైజు శిక్షలేసి వదిలెయ్యడంతో మళ్లీ కల్తీ దందా మొదలైపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్, ఆర్మ్‌డ్ రిజర్వు.. ఇలా అందరూ కలిసి ఎన్నిసార్లు ఉక్కుపాదం మోపినా నో యూజ్. సరిగ్గా ఇక్కడే, సంగారెడ్డి జిల్లాలో గొంగ్లూర్ అనే ఓ గ్రామం గురించి చెప్పుకునే తీరాలి. ఉత్పత్తి–ఉపాధి నినాదంతో 150 మంది మహిళలు ఒక గ్రూప్‌గా ఏర్పడి, తమ ఊరిని కల్తీ రహిత గ్రామంగా మార్చుకున్నారు. సహజ ఉత్పత్తుల తయారీని ఒక ఉద్యమంలా చేపట్టారు. పంట నుంచి వచ్చే పప్పు ధాన్యాల్ని శుద్ధి చేసి అమ్మడం, గానుగ ద్వారా నూనెల తయారీ.. ఇలా అనేక రకాల ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌కి ఈ ఊరు కేరాఫ్. ఇలా వాళ్ల ఆరోగ్యాన్ని వాళ్లే బాధ్యతగా తీసుకున్నారు. బ్యాక్ టు బేసిక్స్ అన్నమాట.

Follow Us