Health: గంటల తరబడి కూర్చుంటున్నారా.. త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు పుష్కలం.. అలా కాకుండా ఉండాలంటే..

|

Jan 29, 2023 | 8:10 AM

ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి మారిపోతున్న లైఫ్ స్టైల్, పని వేళల్లో మార్పుల కారణంగా కంప్యూటర్ ముందు కూర్చుని పని...

Health: గంటల తరబడి కూర్చుంటున్నారా.. త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు పుష్కలం.. అలా కాకుండా ఉండాలంటే..
Sitting Work
Follow us on

ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి
మారిపోతున్న లైఫ్ స్టైల్, పని వేళల్లో మార్పుల కారణంగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చొని పని చేసే వ్యక్తులు తరచుగా వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అయితే తాజాగా నిపుణులు మరో విషయాన్ని కనుగొన్నారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉందని ఇటీవలి పరిశోధనలు సూచించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన పరిణామాలను వివరించారు. ఇందులో హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం కూడా ఉన్నాయి. ఈ కారకాలు తక్కువ శారీరక శ్రమతో కలిపి, అకాల వృద్ధాప్యానికి కూడా కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇది అకాల మరణానికి కూడా దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరించారు. ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగించే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది ఊబకాయం, అధిక రక్తపోటు, నడుము చుట్టూ అధిక కొవ్వు, అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం వంటి దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు.

అకాల వృద్ధాప్యంలో శరీరం అసలు వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లు కనిపిస్తుంది. అకాల వృద్ధాప్యం యొక్క సాధారణ సంకేతాలు ముడతలు, వయస్సు మచ్చలు, పొడిబారడం మొదలైన చర్మ మార్పులు వస్తాయి. అతిగా కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల కారణంగా అకాల వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచడానికి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. 60 నుంచి 75 నిమిషాలు శారీరక శ్రమ చేయడం ద్వారా ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే పరిణామాలను తగ్గించవచ్చు. కంప్యూటర్ డెస్క్ వద్ద ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు పని చేసేటప్పుడు నడవడానికి కొన్ని మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రతి 30 నిమిషాల తర్వాత చిన్న విరామం తీసుకోవాలి. మీటింగ్ రూమ్ లో కూర్చోవడం కంటే సహోద్యోగులతో కలిసి నడవడానికి ప్రయత్నించవచ్చు. ఇది పని ప్రయోజనాలతో పాటు బాడీ ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనూ కూర్చోకుండా నడవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..