రుచి, వాసన తెలియకపోవడం మనలో చాలా మంది ఎప్పుడో అప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో వాసన శక్తిని కోల్పోవడం సహజమే. కరోనా బారిన పడిన సమయంలోనూ ఇలాంటి అనుభవాన్ని చూసే ఉంటారు. అయితే వాసన, రుచి కోల్పోవడం కూడా ఒకరకమైన అనారోగ్య సమస్య అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధుల కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ వాసన, రుచి ఎందుకు కోల్పోతాం, దీని వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయన్న వివరాలు మీకోసం..
వాసన, రుచి కోల్పోవడానికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారికి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు కూడా రుచి, వాసన గుర్తించే శక్తిని కోల్పోతాం. అదేవిధంగా క్యాన్సర్ బాధితుల్లోనూ కొన్నిసార్లు ఈ సమస్య తలెత్తుతుంది. రేడియేషన్ థెరపి, వివిధ మందుల ప్రభావంవల్ల నాలుక రుచిని, ముక్కు వాసనను గ్రహించదు. అయితే చికిత్స, మందుల ప్రభావం తగ్గాక క్యాన్సర్ రోగులు సాధారణ స్థితికి చేరుకుంటారు.
ఇక నోటి చిగుళ్ల ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతోన్న వారు తీసుకునే ఆహారానికి సంబంధించి రుచిని గ్రహించలేరు. ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేకాకుండా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఉన్నవారు కూడా రుచి, వాసన శక్తిని కోల్పోతారు. ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..