
ఖర్జూరాలు మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఆహార పదార్ధాల్లో ఒకటి. మంచి రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాలలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఖర్జూరాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల ప్రభావం కూడా తగ్గుతుంది.
శీతాకాలంలో తీసుకునే ఆహార పదార్థాలలో ఖర్జూరాలను చేర్చూకోవడం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ఈ సీజన్లో డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు. దీనిలో ప్రధానమైనది ఖర్జూరమే. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగజేస్తుంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఖర్జూరాలు సహాయపడతాయి.
ఆయుర్వేదం ప్రకారం కూడా ఖర్జూరాలు మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.
ఖర్జూరాలు తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఖర్జూరంలో ఇనుము, ఖనిజాలు వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఇవి మీ శరీరంలో హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
ఖర్జూరం తీసుకునే పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. వంద్యత్వ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. పడుకునే ముందు ఖర్జూరాలు తీసుకుంటే మంచిది. రాత్రిపూట శరీరం ఖర్జూరాలలోని పోషకాలను మరింత సులభంగా గ్రహిస్తుంది.
అయితే, కొందరు మాత్రం ఖర్జూరాలకు దూరంగా ఉంటేనే మంచిది. కడుపు పూత, కాలేయ వ్యాధి లేదా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఖర్జూరాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తినడం వల్ల వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యలు లేకుంటే మాత్రం ఖర్జూరాలను తినడంలో సంకోచించవద్దు.