
భారత్ ఇప్పుడు ప్రపంచానికి ‘డయాబెటిస్ రాజధాని’ గా మారిపోయింది. మధుమేహం అనేది జీవన శైలి వ్యాధి అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇప్పటికే నిర్ధారించింది. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం డయాబెటిస్ ముప్పును వ్యక్తుల బ్లడ్ గ్రూప్ ఆధారంగా కూడా గుర్తించవచ్చట. ఒక్క జీవన శైలి మాత్రమే కాకుండా జన్యు పరంగా ఎన్నో అంశాలు ఈ వ్యాధికి కారణమవుతాయట. అందులో ఒకటి మన బ్లడ్ గ్రూప్ కూడా అని పరిశోధకులు చెప్తున్నారు. వారు చెప్పిన గణాంకాల ప్రకారం ఏ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ ప్రమాదం ఎంత శాతం మేర ఉందనే విషయాలు తెలుసుకుందాం.
యురోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ కు చెందిన డయాబెటాలోజియా అనే జర్నల్లో దీనిపైన నిర్వహించిన సర్వేలో కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికే డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడించారు. బ్లడ్ గ్రూప్ కు టైప్ టు డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధంపై పరిశోధనలు జరిపారు. మొత్తం 80వేల మంది మహిళలను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వారు వెల్లడించారు.
బ్లడ్ గ్రూపులలో ఏ, బి, ఏబి బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువని గుర్తించారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ కాకుండా ఇతర గ్రూపుల వారికి అసలు షుగర్ వ్యాధి రాదనుకుంటే పొరపాటే. ఇతర బ్లడ్ గ్రూపుల వారికి కూడా వారి వారి జన్యుపరమైన అంశాలు, ఆహారం, జీవన శైలి అలవాట్ల పరంగా షుగర్ వ్యాధి రిస్క్ కచ్చితంగా ఉంటుందని వారుచెప్తున్నారు. ముఖ్యంగా బి బ్లడ్ గ్రూపు ఉన్నవారు డయాబెటిస్ రాకుండా మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని వారు సూచించారు.
పరిశోధకులు చెప్తున్న వివరాల ప్రకారం మహిళల్లో ఈ వ్యాధి ముప్పు 21 శాతం అధికంగా ఉంటుందని వారు తెలిపారు. అదేవిధంగా ఓ బ్లడ్ గ్రూపుతో కంపేర్ చేస్తే ఏ బ్లడ్ గ్రూపు వారికైనా డయాబెటిస్ వచ్చే చాన్స్ 10 శాతం మేర ఉంటుదని వారు తెలిపారు. ఓ బ్లడ్ గ్రూపు వారితో పోలిస్తే బి పాజిటివ్ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నారు.
బ్లడ్ గ్రూపుకు డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది ఇప్పటివరకు తేల్చలేకపోయారు. నాన్ విల్లే బ్రాండ్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్ నాన్ ఓ బ్లడ్ గ్రూపువారిలో ఎక్కువగా ఉంటుందన్నారు. రక్తంలో చక్కర స్థాయిల హెచ్చుతగ్గులకు ఇదే కారణమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.