మాంసం తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా..? షాకింగ్ నిజాలు బయటపెట్టిన లేటెస్ట్ స్టడీ..!

ఎర్ర మాంసం ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా అధ్యయనం మాత్రం దీన్ని పూర్తిగా విభిన్నంగా చూపిస్తోంది. జంతు ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ మరణాల ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ విరుద్ధమైన ఫలితాలు మాంసం తినే వారిలో పెద్ద చర్చకు దారితీశాయి.

మాంసం తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా..? షాకింగ్ నిజాలు బయటపెట్టిన లేటెస్ట్ స్టడీ..!
Can Eating Meat Reduce Cancer Risk

Updated on: Sep 03, 2025 | 11:06 PM

ఎర్ర మాంసం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా క్యాన్సర్ కారక పదార్థంగా వర్గీకరించింది. అయితే కొత్తగా వచ్చిన ఒక అధ్యయనం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధమైన విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జంతు ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ మరణాల ప్రమాదం తగ్గుతుందని ఆ స్టడీ చెబుతోంది.

WHO ఏమని చెప్పింది..?

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ప్రకారం.. గేదె, పంది, మేక లాంటి ఎర్ర మాంసాలు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అదే బేకన్, సాసేజ్‌లు లాంటి ప్రాసెస్ చేసిన మాంసాలు అయితే క్యాన్సర్‌కు కచ్చితంగా కారణమవుతాయని ఈ సంస్థ వెల్లడించింది. చాలా పరిశోధనలు ఎర్ర మాంసం తింటే పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందని సూచించాయి.

కొత్త పరిశోధన ఏం చెబుతోంది..?

కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. జంతు ప్రోటీన్‌ ను ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందట. అయితే దీనికి కారణం కేవలం ఎర్ర మాంసం మాత్రమే కాదు. చేపలు, గుడ్లు, పాలు, పెరుగు లాంటి వాటిలో ఉండే ప్రోటీన్ కూడా ఇందులో భాగమే. ముఖ్యంగా చేపల్లో ఉండే కొన్ని పోషకాలు క్యాన్సర్‌ను అడ్డుకుంటాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చెప్పాయి.

స్టడీలో కొన్ని లోపాలు..

ఈ అధ్యయనంలో ప్రాసెస్ చేసిన మాంసానికి, మామూలు మాంసానికి తేడా చూపించలేదు. గత పరిశోధనల ప్రకారం.. ప్రాసెస్ చేసిన మాంసాలు చాలా ప్రమాదకరమైనవి. అంతేకాకుండా ఈ స్టడీలో వివిధ రకాల క్యాన్సర్లపై విశ్లేషణ చేయలేదు.

శాకాహార ప్రోటీన్‌పై ఫలితాలు..

పప్పులు, గింజలు, టోఫు వంటి శాకాహార ప్రోటీన్లపై కూడా ఈ అధ్యయనం పరిశోధన చేసింది. అవి క్యాన్సర్ మరణాలను తగ్గించడంలో పెద్దగా సహాయం చేయలేదని తేలింది. ఈ విషయం కొన్ని పాత పరిశోధనలకు భిన్నంగా ఉంది. అయినప్పటికీ మొక్కల ప్రోటీన్లలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచివే.

ఏం తినాలి..?

ఈ కొత్త అధ్యయనం మాంసాన్ని ఎక్కువగా తినమని చెప్పడం లేదు. ఎక్కువగా ఎర్ర మాంసం తింటే గుండె జబ్బులు, షుగర్ లాంటి సమస్యలు వస్తాయి. అందుకే మాంసాన్ని మితంగా, అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడం అవసరం. ఆహారం విషయంలో ఒకే రకం తినడం మంచిది కాదు. కూరగాయలు, పండ్లు, మొక్కల ప్రోటీన్లు, అలాగే మితంగా జంతు ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)