ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య ఆస్తమా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24.5 కోట్లకు పైగా ఆస్తమాతో (Asthma) బాధపడుతున్నారని అంచనా. వారిలో ఒక్క ఇండియాలోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ఉన్నట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాతో ఒక్క 2015లోనే 3,83,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో 11 ఏళ్ల లోపు చిన్నారుల్లో నూటికి 5 నుంచి 15 మంది ఆస్తమా (asthma symptoms) బారిన పడుతున్నారు.
మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఆస్తమా కిందకే వస్తాయి. దీనిని ఉబ్బసం అని కూడా పిలుస్తుంటారు.
ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటుంది. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. చలికాలం, పెంపుడు జంతువులు, వాటి ఉన్ని, గాలిలోని రసాయనాలు, ఘాటు వాసనలు, అతిగా చేసే శారీరక శ్రమ, పుప్పొడి రేణువులు, ఇవన్నీ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి. శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
అస్తమా ఉన్న వారు ఉల్లిపాయ ఎక్కువగా తినాలి. ఉల్లిపాయల్లో యాంటీ – ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ‘ హిస్తమిన్ ‘ విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్‌స్ట్రక్షన్ తగ్గుతుంది. అలాగే కమలాలు, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ ‘సి’ ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు చెపుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆధారాలు ఉన్నాయి. రెడ్ క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువ. ఇన్‌ప్లమేషన్ తగ్గించడంలో బాగా దోహదపడుతుంది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Sleeping Disorder: నిద్రపోయే ముందు ఈ 5 ఆహారాలను దూరం పెట్టండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా!