
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన మామిడి పళ్లు.. ఫిబ్రవరి, మార్చిలోనే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వ్యాపారులు లాభాల కోసం ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి వీటిని బలవంతంగా పండిస్తున్నారు. ఇలా రసాయనాలతో పండిన పళ్లు తింటే తక్షణమే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు సహజంగా పండిన పండును, కెమికల్ పండును ఎలా గుర్తించాలి? ముందస్తు మామిడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం..
1. కాల్షియం కార్బైడ్ ప్రమాదం:
చాలామంది వ్యాపారులు మామిడి కాయలను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ (Calcium Carbide) ఉపయోగిస్తారు. ఇది పండ్లలోని తేమతో చర్య జరిపి ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది.
దుష్ప్రభావాలు: ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మెమరీ లాస్, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది.
2. జీర్ణకోశ సమస్యలు:
రసాయనాలతో పండిన మామిడి పళ్లు తిన్న వెంటనే కడుపులో మంట, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. వీటిలోని విషతుల్యాలు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
3. క్యాన్సర్ కారకాలు:
కార్బైడ్ వంటి రసాయనాల్లో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విష పదార్థాలు ఉంటాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
4. సహజమైన రుచి ఉండదు:
కెమికల్స్‌తో పండించిన పళ్లు బయట పసుపుగా ఉన్నా, లోపల పుల్లగా లేదా చప్పగా ఉంటాయి. ఇవి తిన్నా ఎలాంటి పోషకాలు అందవు సదా ఆనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే.
ఎలా గుర్తించాలి?
రంగు: పండు మొత్తం ఒకే రకమైన పసుపు రంగులో ఉండి, అక్కడక్కడా పచ్చటి చారలు లేకపోతే అది కెమికల్ పండు అని అనుమానించాలి.
వాసన: సహజంగా పండిన పండు గది అంతా సువాసన వస్తుంది. కెమికల్ పళ్లకు అస్సలు వాసన ఉండదు.
నీటి పరీక్ష: మామిడి పండును నీళ్లలో వేస్తే.. మునిగితే అది సహజమైనది, తేలితే అది రసాయనాలతో పండించింది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పండుగకు ముందు వచ్చే పళ్లను కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు సీజన్ మొదలయ్యాక సహజంగా పండిన పళ్లను తినడమే శ్రేయస్కరం.