AIG Hospital: ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో డిస్పోజబుల్ డ్యూడెనోస్కోప్‌తో పైత్యరసనాళంలోని రాళ్లను తొలగించారు. 93 ఏళ్లు ఉన్న వృద్దుడికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించామని థెరపిక్ ఎండోస్కోపీ విభాగం డైరెక్టర్ మోహన్ రామచంద్రాని శనివారం తెలిపారు. కాగా, బాధితుడు కడుపు నొప్పితో ఇటీవల తమ ఆస్పత్రిలో చేరాడని, ఆయన పైత్యరసనాళంలో రాళ్లు అడ్డుగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. ఇవి సాధారణం కన్నా పెద్దగా ఉన్నాయని, దీంతో ఆయన రక్తం విషపూరితంగా మారుతున్నదని అన్నారు. అలాగే రక్తపోటు అదుపులో ఉండటం లేదన్నారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం డిస్పోజబుల్ డ్యూడెనోస్కోప్ సాయంతో ఆ రాళ్లను ముక్కలుగా చేసి బయటకు తీసినట్లు చెప్పారు.
సాధారణంగా డ్యూడెనోస్కోప్‌ను కాలేయం, పైత్యరస నాళ సంబంధ వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారని, అయితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు. దీనిని అధిగమించేందుకు డిస్పోజబుల్ డ్యూడెనోస్కాప్‌ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించాన్నారు. దీనిని ఆసియాలోనే మొదటిసారిగా తమ ఆస్పత్రిలో వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: Snoring Natural Tips: మీకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉందా..? అయితే ఈ చిట్కాలు పాటించండి