మీ ప్రాణాలను కాపాడేది ఈ సంకేతాలే.. హార్ట్ అటాక్‌ కు ముందు కనిపించే లక్షణాలు ఇవే..!

గుండెపోటు అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. రాబోయే కొన్ని రోజుల ముందుగానే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని మామూలు సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదు. ఈ సంకేతాలను ముందుగానే గమనిస్తే గుండె జబ్బుల నుంచి రక్షించుకోవచ్చు.

మీ ప్రాణాలను కాపాడేది ఈ సంకేతాలే.. హార్ట్ అటాక్‌ కు ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
Heart Healthy

Updated on: Jul 07, 2025 | 5:10 PM

గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం.. గుండెపోటు రాబోయే నెల రోజుల ముందు నుంచే మన శరీరం కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. వాటిని మామూలు సమస్యలుగా భావించి.. పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదంలో పడవచ్చు. ఈ లక్షణాలను గమనించి త్వరగా వైద్య పరీక్షలు చేయించుకుంటే.. జీవితాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ECG లేదా ఎకోకార్డియోగ్రాఫీ వంటి పరీక్షలు ఈ లక్షణాల పైన స్పష్టతను ఇవ్వగలవు. అయితే సమస్య ఏంటంటే.. ఈ సంకేతాలు చాలా సార్లు చిన్నగా కనిపించి మనం దృష్టి పెట్టం.

ఛాతీలో అసహజ ఒత్తిడి

గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాల్లో ఛాతీలో అసహజ ఒత్తిడి ఒకటి. ఛాతీలో చిన్నగా గుచ్చినట్లు అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు ఉండటం లేదా నొప్పి వచ్చి తగ్గుతూ మళ్ళీ మళ్ళీ వస్తుంటే అది మొదటి దశ లక్షణం కావచ్చు. ఈ నొప్పి ఎడమ చేయి, మెడ, దవడ లేదా నడుము వరకు పాకితే.. అది గుండెపోటుకు స్పష్టమైన సంకేతంగా గుర్తించాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కొద్దిగా పనిచేసినా ఆయాసం రావడం, శ్వాస వేగంగా మారడం, ఊపిరి అందక ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తే.. అది గుండె సరిగ్గా పనిచేయడం లేదని సూచించవచ్చు. శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందడం లేదని దీని అర్థం.

అలసట శక్తిలేమి

రోజువారీ పనులు చేయడంలో అధిక అలసటగా అనిపించడం, చిన్న పని చేసినా కష్టంగా అనిపించడం.. ఇది ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో ముందుగా కనిపించే లక్షణాల్లో ఒకటి. ఇది కొన్ని వారాల ముందు నుంచే మొదలవుతుంది.

చెమట పట్టడం

మామూలుగా ఉన్నప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు చెమట పట్టడం గుండె ఒత్తిడిలో ఉందని సంకేతంగా పరిగణించవచ్చు. ఇది గుండెపోటు ముందు కనిపించే కీలక లక్షణాలలో ఒకటి.

నిద్రలో అస్వస్థత

గుండె సంబంధిత సమస్యల ముందు చాలా మందిలో నిద్రలో అంతరాయాలు కలుగుతాయి. మళ్ళీ మళ్ళీ మేలుకోవడం, కలవరంగా ఉండడం, కొన్ని సందర్భాల్లో అసహజ కలలు రావడం వంటి మార్పులు గమనించవచ్చు.

గుండె సరిగా కొట్టుకోకపోవడం

గుండె ఒక్కసారిగా వేగంగా లేదా అసమాన్యంగా కొట్టుకోవడం కూడా గుండెలోని విద్యుత్ ప్రవాహంలో ఏదో లోపం ఉందని సూచిస్తుంది. ఇలా జరిగితే భవిష్యత్తులో హార్ట్ బ్లాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది.

కడుపు సమస్యలు

కొంతమందిలో ఛాతీలో నొప్పిగా కాకుండా.. వికారం, అజీర్ణం, కడుపులో మంట లేదా నొప్పిగా అనిపించవచ్చు. ఇవి గ్యాస్ సమస్యలుగా అనిపించినా నిజానికి హార్ట్ అటాక్‌ కు ముందస్తు సంకేతాలుగా ఉండొచ్చు. ఇది ముఖ్యంగా మహిళలలో కనిపించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ లక్షణాల్లో ఏవైనా తరచూ కనిపిస్తే.. వాటిని తేలికగా తీసుకోకండి. తక్షణమే కార్డియాలజిస్ట్‌ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవగాహన కలిగి ఉండడం.. ముందుగానే స్పందించడం మన హృదయాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)