Vani Jayaram Death Reason: గాయని వాణీ జయరాం మృతికి అసలు కారణం ఇదే.. ఫోరెన్సిక్ రిపోర్టులో ఏం వచ్చిందంటే..

|

Feb 06, 2023 | 9:54 AM

నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. థౌజండ్‌లైట్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ టీం తాజాగా వాణీ జయరాం మృతికి గల కారణాలను..

Vani Jayaram Death Reason: గాయని వాణీ జయరాం మృతికి అసలు కారణం ఇదే.. ఫోరెన్సిక్ రిపోర్టులో ఏం వచ్చిందంటే..
Vani Jayaram Death Reason
Follow us on

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం (78) చెన్నైలో ఆమె నివాసంలో శనివారం (ఫిబ్రవరి 4) మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం నుంగంబాక్కంలోని తన గృహంలో తలకు గాయాలు, రక్తస్రావంతో పడి ఉన్న ఆమెను సన్నిహితులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. థౌజండ్‌లైట్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ టీం తాజాగా వాణీ జయరాం మృతికి గల కారణాలను తెలియజేస్తూ రిపోర్టు విడుదల చేసింది. బెడ్రూంలో కిందపడటంతో తలకు బలమైన గాయం తగిలిందని, అందువల్లనే ఆమె మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో వాణీ జయరాం మృతిపై నెలకొన్న అనుమానాలు తొలగినట్లైంది.

కాగా.. వాణీజయరాం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరుకు చెందిన దురైస్వామి, పద్మావతి దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టిన వాణీ పదేళ్ల వయసులోనే ఆల్‌ఇండియా రేడియోలో పాటలు పాడారు. 1971లో గుడ్డీ అనే హిందీ సినిమాలో గాయనిగా అరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా దాదాపు 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం. మూడు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. మొన్న కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డుల్లో వాణీ జయరాంకు పద్మశ్రీ ప్రకటించినప్పటికీ అందుకోకుండానే తుది శ్వాసవిడిచారు. వాణీ జయరాం 1968 జయరాంను వివాహం చేసుకున్నారు. జయరాం 2018లోనే కన్నుమూశారు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా జీవనం సాంగించారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.