
‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా పట్టాలెక్కిన ‘మెరుపు’ చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా..? భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎంతో అత్యుత్సాహంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ కేవలం 15 రోజుల చిత్రీకరణ తర్వాతే అటకెక్కింది. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో మొదటిది సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్న దానికంటే హద్దులు మీరడం కాగా.. రెండోది అప్పటివరకు తీసిన అవుట్ పుట్ మెగాస్టార్ చిరంజీవిని ఏమాత్రం మెప్పించలేకపోవడం. ఈ రెండు కారణాల వల్లే ఎన్నో అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయి. కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ధరణి తెరకెక్కించాల్సిన ఈ స్పోర్ట్స్ డ్రామా 2010 ఏప్రిల్ 30వ తేదీన ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అప్పట్లో ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ కూడా బాగానే జరిగింది.
ముఖ్యంగా రామ్ చరణ్‌కు జోడీగా మగధీర బ్యూటీ కాజల్‌నే తీసుకున్నారు. పైగా ధరణికి అప్పటికే తమిళంలో చాలా పెద్ద హిట్లు ఉన్నాయి.. మరోవైపు తెలుగులో ఆయన చేసిన బంగారం కూడా పర్లేదు అనిపించింది. మెరుపు సినిమాను ఆర్.బి. చౌదరి తన సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందాల్సి ఉంది. ఈ సినిమా తొలి షాట్ కు చిరంజీవినే స్వయంగా క్లాప్ ఇచ్చారు. గతంలో చిరు నటించిన సూపర్ హిట్ చిత్రం ‘విజేత’ తరహాలో ఈ స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీ తన కెరీర్ లో కూడా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ బలంగా నమ్మాడు. అందుకే ఓపెనింగ్ రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ స్థాయిలోనే హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాకు షూటింగ్ మొదలుకాకముందే హీరోయిన్ల ఎంపిక విషయంలో తలనొప్పులు మొదలయ్యాయి.
అప్పటికే ఆరెంజ్ సినిమాలో చరణ్‌కు జోడీగా నటించిన బాలీవుడ్ భామ షాజన్ పదామ్సీని అనుకున్నా.. ఫోటోషూట్ రిజల్ట్‌తో ఆమెను పక్కనపెట్టి కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసారు. కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం విపరీతంగా ఆలస్యం కావడంతో.. ఇతర సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక కాజల్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో ఇలియానాను తీసుకోవాలని చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపింది. హీరోయిన్ల సమస్య పక్కనపెడితే.. అసలు చిక్కు బడ్జెట్ రూపంలో ముందుకొచ్చింది. ముందుగా 35 కోట్ల రూపాయలతో సినిమా తీయాలని ప్లాన్ చేస్తే, దర్శకుడు దాన్ని కాస్తా అదనంగా మరో 10 కోట్లు పెంచేశాడు. ఆ సమయంలోనే ఆరెంజ్ సినిమా విడుదలై డిజాస్టర్ కావడంతో.. ఆ సమయంలో నిర్మాత రిస్క్ తీసుకోలేకపోయాడు.
బడ్జెట్ చూసి నిర్మాత ఆర్.బి. చౌదరి తనవల్ల కాదంటూ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గారు. చివరకు చిరంజీవి చొరవ తీసుకుని నచ్చజెప్పడంతో చెన్నైలో 15 రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ చేశారు. ఈ చిన్న షెడ్యూల్‌కే ఏకంగా 8 కోట్లు ఖర్చు కావడం, తీసిన సీన్స్ చూశాక చిరంజీవికి ఏమాత్రం సంతృప్తినివ్వకపోవడంతో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దీంతో స్క్రిప్ట్‌లో అవసరమైన మార్పులు చేయాలని దర్శకుడు ధరణికి చిరు సూచించారు. ఆయన ఆ పనిలో ఉండగానే.. అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సంపత్ నంది దర్శకత్వంలో చరణ్‌తో ‘రచ్చ’ ప్రాజెక్ట్ ను ఆర్.బి. చౌదరి పట్టాలెక్కించారు. ఆ తర్వాత చిరంజీవి దర్శకుడు ధరణిని పిలిపించి.. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోందని, ఇప్పటికే భారీగా ఖర్చు అయిందని చెబుతూ సినిమాను ఇక్కడితో క్యాన్సిల్ చేయడమే మంచిదని ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆ తర్వాత ఎన్.వి. ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ను మళ్లీ పునఃప్రారంభిస్తారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అలా యాక్షన్ కింగ్ అర్జున్ ఫుట్ బాల్ కోచ్‌గా నటించాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మధ్యలోనే ముగిసిపోయింది.
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?