AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Nayakudu Review : ‘జన నాయకుడు’ రివ్యూ.. విజయ్ చివరి సినిమా టాక్ ఏంటి.. బ్లాస్ట్ అయిందా లేదా..?

విజయ్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ చేసిన ఆఖరి చిత్రం 'జననాయగన్'. 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో జన నాయకుడుగా విడుదలైంది. ప్రజా నాయకుడిగా విజయ్ ఇమేజ్‌కు సరిపోయేలా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది.. మెప్పించిందా లేదా అనేది చూద్దాం..

Jana Nayakudu Review : ‘జన నాయకుడు’ రివ్యూ.. విజయ్ చివరి సినిమా టాక్ ఏంటి.. బ్లాస్ట్ అయిందా లేదా..?
Jana Nayagan Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 1:42 PM

Share

మూవీ రివ్యూ: జన నాయకుడు

నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ మీనన్, రేవతి తదితరులు

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఎడిటర్: ప్రదీప్ రాఘవ్

రచన, దర్శకుడు: హెచ్ వినోద్

నిర్మాత: వెంకట్ కే నారాయణ

విజయ్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ చేసిన ఆఖరి చిత్రం ‘జననాయగన్’. ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో జన నాయకుడుగా విడుదలైంది. ప్రజా నాయకుడిగా విజయ్ ఇమేజ్‌కు సరిపోయేలా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది.. మెప్పించిందా లేదా అనేది చూద్దాం..

కథ:

మదురై జైలులో ఒక ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న దళపతి వెట్రి కొండాన్ (విజయ్) చుట్టూ ఈ కథ మొదలవుతుంది. అప్పటికే జైల్లో వెట్రిని చంపడానికి 20 సార్లు ప్రయత్నాలు జరుగుతాయి.. అయినా అతను ప్రాణాలతో బయటపడతాడు. ఆ జైలర్ శ్రీకాంత్ (గౌతమ్ మీనన్) సాయంతో చివరిదశలో ఉన్న తల్లి (రేవతి)ని చూస్తాడు వెట్రి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ కూతురు విజ్జి (మమిత బైజు)తో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అదే సమయంలో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు మరణించడంతో.. విజ్జీ బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. తండ్రి కల ప్రకారం విజీని మిలిటరీ ఆఫీసర్‌ను చేయాలని వెట్రి లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ ప్రయాణంలో టీవీ జర్నలిస్ట్ కయల్ (పూజా హెగ్డే) వీళ్ళ జీవితాల్లోకి వస్తుంది. మరోవైపు ఆఫ్రికాలోని ఒక దేశాన్ని, అక్కడి ప్రభుత్వాలను శాసిస్తున్న కరుడుగట్టిన నేరస్థుడు జాన్ హిమ్లర్ (బాబీ డియోల్), భారతదేశంలో అలజడి సృష్టించేందుకు ఆయుధాలు సరఫరా చేస్తుంటాడు. కేవలం విజీని మాత్రమే కాకుండా, ఈ ప్రమాదకరమైన శత్రువు నుంచి తన ప్రజలందరినీ కాపాడుకోవడానికి వెట్రి ఎలాంటి యుద్ధం చేశాడు? చివరికి విజీని మిలిటరీ ఆఫీసర్‌గా మార్చాడా లేదా? అనేది మిగిలిన కథ.

కథనం:

దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని పూర్తిగా విజయ్ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా తీర్చిదిద్దారు. ప్రథమార్థం మొత్తం వెట్రి జైలు జీవితం, విజ్జితో అతని భావోద్వేగ అనుబంధం చుట్టూ సాగుతుంది. ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇది భగవంత్ కేసరి సినిమా రీమేక్‌గానే వచ్చింది. ఫస్టాఫ్‌లో బాబీ డియోల్ సీన్స్ మినహాయిస్తే మిగిలిందంతా బాలయ్య సినిమా నుంచే తీసుకున్నారు. ఫస్టాఫ్ అంతా మామూలుగానే సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ మంచి యాక్షన్ సీక్వెన్స్‌తో ముగిసింది. సెకండాఫ్ మాత్రం పూర్తిగా మార్చేసుకున్నారు వినోద్. వెట్రి, జాన్ హిమ్లర్ మధ్య జరిగే పోరాటాలు బాగానే ఉన్నాయి. సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక విప్లవ నాయకుడిగా విజయ్ పాత్రను మలిచిన తీరు బాగుంది. ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించిన సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. కథనంలో తమిళ రాజకీయాలకు సంబంధించిన అంశాలు, ఎంజీఆర్ ప్రస్తావన, బాలకృష్ణకు ఇచ్చిన గౌరవం, అలాగే విజయ్ నిజ జీవిత రాజకీయ ప్రసంగాలను కథలో ఇమిడ్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో మెసేజ్ డోస్ కాస్త ఎక్కువైంది. పొలిటికల్ మెసేజ్‌లపై పెట్టిన శ్రద్ధ కథలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలపై పెట్టకపోవడం చిన్న లోపం. మొదటి సగంలో పరిచయమైన చాలా పాత్రలు, రెండో సగంలో విజయ్ ప్రయాణం వెనుక మరుగున పడిపోతాయి. అయినా సరే విజయ్ మార్క్ డ్యాన్సులు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఆయన అభిమానులకు నచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ పాత సినిమాలను గుర్తుచేసేలా పెట్టిన యాక్షన్ బ్లాక్స్, ఆయన చెప్పిన “వాట్ బ్రో.. ఇట్స్ వెరీ రాంగ్ బ్రో” లాంటి పంచ్ డైలాగులు థియేటర్లలో బాగానే పేలాయి. క్లైమాక్స్ మాత్రం రోబో సినిమాలో శంకర్ మాదిరి చాలా అడ్వాన్డ్డ్‌గా ప్లాన్ చేసారు వినోద్. ఆ డోస్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. చివరగా భగవంత్ కేసరిలో బాలయ్య నటన చూసిన వాళ్లకు.. ఈ సినిమాలో విజయ్ నటన చూడటం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. తమిళనాడులో మాత్రం దళపతి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అవుతుందేమో కానీ మన దగ్గర బాలయ్య మార్క్ దాటడం కాస్త కష్టమే.

నటీనటులు:

ఇది పూర్తిగా దళపతి విజయ్ వన్ మ్యాన్ షో.. తెరపై కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ తనదైన శైలి, చరిష్మాతో ఆయన అదరగొట్టారు. యాక్షన్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా విజయ్ నటన బాగుంది. ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ తన గంభీరమైన రూపంతో, నటనతో విజయ్‌కు సమానమైన పోటీనిచ్చారు. హీరోయిన్ పూజా హెగ్డే కంటే విజ్జి పాత్రలో నటించిన మమితా బైజుకు మంచి ప్రాధాన్యత దక్కింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, సునీల్, రేవతి వంటి స్టార్స్ ఉన్నప్పటికీ.. కథ విజయ్ చుట్టూనే తిరగడంతో వారికి పెద్దగా స్కోప్ లభించలేదు. సినిమాలో వచ్చే కొన్ని ఊహించని అతిథి పాత్రలు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తాయి.

టెక్నికల్ టీం:

అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నాయి.. నేపథ్య సంగీతం ఓకే. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌ను చాలా గ్రాండ్‌గా చూపించింది. ఎడిటర్ ప్రదీప్ రాఘవ్ పనితీరు బాగున్నప్పటికీ, మూడు గంటలకు పైగా ఉన్న సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాత వెంకట్ కే నారాయణ కథకు మించి ఖర్చు చేసారు.. దర్శకుడు అడిగిన ప్రతీది ఇచ్చేసాడు. దర్శకుడు వినోద్ భగవంత్ కేసరి కథలోని కొన్ని సీన్స్ తీసుకుని.. మిగిలింది విజయ్‌కు తగ్గట్లు మార్చుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా జన నాయకుడు.. దళపతి యాక్షన్ కమ్ పొలిటికల్ షో..!

Follow Us