DSP to A.R.Rahman: రికార్డింగ్ రూమ్ టు మేకప్ రూమ్.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
మ్యూజిక్‌తో థియేటర్లలో ఈలలు, స్టెప్పులు వేయించే మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సంగీతమే కాదు తమలో మరో టాలెంట్ కూడా ఉందంటున్నారు. దానికి ప్రూవ్ చేసుకుని సినీ ప్రేమికులకు మరింత చేరువవుతామని కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నారు మన మ్యూజిక్ మాస్టర్స్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన మ్యూజిక్ వినిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. తనదైన స్టెప్పులతో స్టేజ్ మీద మ్యాజిక్ చేసే ఈ రాక్ స్టార్, ఇప్పుడు వెండితెరపై హీరోగా విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కేవలం స్వరాలనే నమ్ముకున్న ఈ స్టార్ కంపోజర్, ఇప్పుడు మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వస్తున్నారు. ఆయన మాత్రమే కాదు, టాలీవుడ్‌ను ఊపేస్తున్న మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ నటుడిగా పలకరించబోతున్నారు.
రాక్ స్టార్ హీరోగా ‘ఎల్లమ్మ’..
చాలా కాలంగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందరూ అనుకున్నదే ఇప్పుడు నిజమైంది. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి, ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ కథను కొందరు హీరోలు రిజెక్ట్ చేసినప్పటికీ, వేణు మాత్రం దేవిశ్రీప్రసాద్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మారు.
‘ఎల్లమ్మ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాతో డీఎస్పీ తనలోని నటుడిని పరిచయం చేయబోతున్నారు. సంగీత దర్శకుడిగానే కాకుండా మంచి డాన్సర్‌గా పేరున్న ఆయన, ఈ చిత్రంతో ఏ స్థాయి పర్ఫార్మెన్స్ చూపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Thaman
తమన్ రీ-ఎంట్రీ.. రెహమాన్ కొత్త అవతారం..
ఈ జాబితాలో మరో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా మెరిసిన తమన్, చాలా కాలం తర్వాత మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. ఆయనతో పాటు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా ఒక క్రేజీ ప్రాజెక్టుతో నటుడిగా, దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘మూన్ వాక్’ అనే చిత్రంలో రెహమాన్ తన కొత్త అవతారాన్ని చూపించనున్నారు. ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లంతా ఒకేసారి హీరోలుగా మారి అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కోలీవుడ్ దారిలో టాలీవుడ్..
తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయగా, జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు అదే బాటలో తెలుగు కంపోజర్స్ కూడా ప్రయాణం మొదలుపెట్టారు. కేవలం మ్యూజిక్ రూమ్‌కే పరిమితం కాకుండా, వెండితెరపై కూడా సత్తా చాటగలమని వీరు నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సంగీత సామ్రాజ్య అధినేతలు వెండితెరపై హీరోలుగా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.
