
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ సాయి పల్లవికి ఫ్రెండ్ గా నటించింది. దీంతో పాటు కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్, అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ తదితర సినిమాలు, వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసింది. అయితే సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలిచింది గాయత్రి. ముక్కు సూటిగా, ధైర్యంగా మాట్లాడేతత్వమున్న ఆమె కొందరు ప్రొడ్యూసర్లు తనను లైంగికంగా వేధించారంటూ సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ బోల్డ్ వీడియోస్ పెట్టి షాకులు ఇస్తుంటుంది. తాజాగా ఆమె మరో సంచలన వీడియోను పోస్ట్ చేసింది.
‘గత కొన్ని నెలలుగా నాకు తీవ్రమైన పానిక్ అటాక్ వస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రస్తుతం లైంగిక వేధింపుల వల్ల కలిగిన తీవ్రమైన మానసిక గాయంతో బాధపడుతున్నాను. నాకు సాయం కావాలి. నేను థెరపీ తీసుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాను, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వాయిస్ ఆఫ్ ఉమెన్ వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎవరిని ఆశ్రయించాలో, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నన్ను ఆదుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. చావు అంచున ఉన్న నన్ను నేను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. ఎవరితోనైనా మాట్లాడి సహాయం పొందడమే. నా వ్యక్తిగత జీవితంలో సహాయం కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడా ఎలాంటి సాయం దొరకలేదు. ఏదైనా చేయడానికి నాకు ఒక లాయర్ అవసరమా? లేదా థెరపిస్ట్ అవసరమా? అనేది నాకు తెలియదు’
‘ఇప్పుడు కూడా నేను తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాను. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. సహాయం ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు అది చాలా అవసరం. అండగా ఉంటాం, తోడుగా ఉంటాం అని సోషల్ మీడియాలో చెప్పే డ్రామాలు, మాటలు కోకొల్లలు.. కానీ నిజానికి ఎవరికీ ఏమాత్రం పట్టదు. పైకి మాత్రం తాము పట్టించుకుంటున్నట్లు నటిస్తారు. ఎవరికీ నిజంగా నా మీద శ్రద్ధ లేదు’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది గాయత్రి. అయితే ఏమైందో తెలియదు కానీ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్ కొట్టేసిందీ టాలీవుడ్ నటి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి