Tollywood Remunerations: హీరోల రెమ్యూనరేషన్లలో భారీ మార్పులు..20 ఏళ్ల క్రితం ఏ హీరో ఎంత తీసుకునేవారో తెలుసా?

టాలీవుడ్ బాక్సాఫీస్ రేంజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు ముప్పై కోట్లు వసూలు చేస్తే గొప్ప అనుకునే రోజులు పోయి, ఇప్పుడు ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్ల వైపు అడుగులు పడుతున్నాయి. సినిమాల కలెక్షన్లు పెరిగినట్టే, మన హీరోల పారితోషికాలు కూడా ఊహకందని స్థాయికి చేరుకున్నాయి.

Tollywood Remunerations: హీరోల రెమ్యూనరేషన్లలో భారీ మార్పులు..20 ఏళ్ల క్రితం ఏ హీరో ఎంత తీసుకునేవారో తెలుసా?
Chiru And Allu Arjun

Updated on: Jan 31, 2026 | 6:10 AM

నేడు ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నారంటే వంద నుంచి రెండు వందల కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. కానీ సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు టాలీవుడ్‌ను శాసించిన దిగ్గజ హీరోల పారితోషికం ఇప్పుడు ఒక చిన్న హీరో తీసుకునేంత కూడా ఉండేది కాదు. అప్పట్లో నంబర్ వన్ హీరోగా ఉన్న వ్యక్తి పారితోషికం పది కోట్లు దాటడమే ఒక పెద్ద సంచలనం. మరి అప్పటి టాప్ స్టార్స్ నుంచి ఇప్పటి పాన్ ఇండియా స్టార్స్ వరకు రెమ్యూనరేషన్ల ప్రయాణం ఎలా సాగిందో ఆ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి

2006 కాలంలో టాలీవుడ్ అగ్ర సింహాసనంపై ఉన్న వ్యక్తి చిరంజీవి. ఆ సమయంలో ‘స్టాలిన్’ వంటి భారీ చిత్రంలో నటిస్తున్న ఆయన పారితోషికం రూ. 10 కోట్లు. అప్పట్లో ఇదే అత్యధిక రెమ్యూనరేషన్. సినిమా మొత్తం కలెక్షన్లే రూ. 30 – 40 కోట్లు ఉన్న ఆ రోజుల్లో 10 కోట్లు తీసుకోవడం అంటే అది మెగాస్టార్ స్టామినాకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 70 నుంచి 80 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

Nagarjuna Venkatesh Balakrishna

నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్..

సీనియర్ హీరోల్లో నాగార్జున అప్పట్లో ‘శ్రీరామదాసు’ వంటి సంచలన హిట్ సమయంలో రూ. 9 కోట్ల వరకు తీసుకునేవారట. ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ రూ. 15 నుంచి 20 కోట్ల మధ్య ఉందని టాక్. ఇక బాలకృష్ణ, వెంకటేష్ ఇద్దరూ 2006 ప్రాంతంలో సమానంగా రూ. 4 కోట్ల చొప్పున పారితోషికం అందుకునేవారు. ‘లక్ష్మి’, ‘వీరభద్ర’ వంటి సినిమాల సమయం అది. నేడు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నారు.

Pawan And Mahesh

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

2006లో ‘పోకిరి’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు అప్పట్లో రూ. 5 కోట్లు తీసుకునేవారు. నేడు రాజమౌళి వంటి దర్శకులతో పని చేస్తూ వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. అటు పవన్ కళ్యాణ్ ‘బంగారం’, ‘అన్నవరం’ సినిమాల సమయంలో రూ. 3.5 కోట్లు అందుకునేవారు. వరుస హిట్లతో ఇప్పుడు ఆయన పారితోషికం ‘ఓజీ’ సినిమా నాటికి రూ. 100 కోట్ల మార్కును చేరడం విశేషం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్

ఇరవై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ రూ. 3.5 కోట్ల పారితోషికం అందుకునేవారు. నేడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన రేంజ్ మారిపోయి రూ. 80 నుంచి 100 కోట్లకు చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘పౌర్ణమి’ సమయంలో కేవలం రూ. 2.5 కోట్లే తీసుకున్నారు. కానీ ‘బాహుబలి’ తర్వాత ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తం కావడంతో ఇప్పుడు ఏకంగా రూ. 150 నుంచి 180 కోట్ల వరకు అందుకుంటున్నారు.

అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్

మాస్ మహారాజా రవితేజ ‘విక్రమార్కుడు’ వంటి హిట్ సమయంలో రూ. 3.5 కోట్లు తీసుకునేవారు, ఇప్పుడు అది రూ. 20 కోట్లకు చేరింది. గోపీచంద్ అప్పట్లో కోటిన్నర తీసుకుంటే ఇప్పుడు రూ. 5 కోట్లు అందుకుంటున్నారు. అయితే అందరిలోకి షాకింగ్ మార్పు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలోనే కనిపిస్తుంది. ‘హ్యాపీ’ సినిమా సమయంలో కేవలం రూ. 1.5 కోట్లు తీసుకున్న బన్నీ, ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత ఏకంగా రూ. 200 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించారు.

కాలం మారుతున్న కొద్దీ తెలుగు సినిమా మార్కెట్ అద్భుతంగా విస్తరించింది. లక్షల నుంచి కోట్ల వరకు, ఆపై వందల కోట్ల వరకు హీరోల పారితోషికాలు పెరగడం టాలీవుడ్ ఎదుగుదలకు నిదర్శనం.